Koushik Reddy Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకుని.. వరంగల్ తరలించారు సుబేదారి పోలీసులు. బీఎన్‌ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు.
కమలాపురం మండలం వంగపల్లిలో.. క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ అనే గ్రానైట్ వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని మనోజ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగానే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.
గతేడాది ఏప్రిల్‌లో ఈ కేసును కొట్టివేయాలని కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, జూన్ 16న దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో ఇదే కేసులో అరెస్ట్‌పై స్టే ఇచ్చిన కోర్టు, దర్యాప్తునకు సహకరించాలని అప్పట్లో ఆదేశించింది.
తాజాగా పిటిషన్ కొట్టివేయడంతో కౌశిక్ రెడ్డి అరెస్ట్‌కు మార్గం సుగమమైంది. ఈ అరెస్ట్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్‌గా ఉన్న కౌశిక్ రెడ్డిని కావాలనే అరెస్టు చేసినట్లు ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు.
కాగా ఇటీవల బీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డిలపై ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, అక్కడ సీఐ రాఘవేంద్ర తన ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించారని, తనను చూడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
ఆ సమయంలో కౌషిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హల్చల్ చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కూడా అరెస్ట్ చేస్తే చచ్చిపోతానని డ్రామా క్రియేట్ చేసి పోలీసులను బెదిరించారు. దీంతో ఆయనపై రెండో కేసు నమోదు చేశారు గచ్చిబౌలీ పోలీసులు.
బంజారాహిల్స్ పీఎస్ లో తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ సీఐ రాఘవేంద్ర కంప్లయింట్ చేశారు. దీంతో కౌశిక్ రెడ్డితో పాటు ఆయన 20 మంది అనుచరులపై కేసు నమోదయ్యింది.
పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ స్పందించారు. శంషాబాద్ విమానాశ్రయంలో.. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం.. అత్యంత దుర్మార్గమైన చర్య అని, సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అక్రమాలను, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడుగునా కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు కాబట్టే.. ఆయనపై కక్షకట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇలా పనికిరాని కేసులు, బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకునే రేవంత్.. ఎమర్జెన్సీని తలపించేలా ప్రశ్నించే గొంతులపై అణచివేత చర్యలతో ప్రజాక్షేత్రంలో అబాసపాలవుతున్నాడని కేటీఆర్ అన్నారు.
Also Read: చంద్రబాబుతో రేవంత్‌రెడ్డి చర్చలు! అంతా ఆయనే చేశారు..
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను.. అమలు చేయలేని తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే.. రేవంత్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.