CM KCR Speech(Ambedkar Jayanti News): దేశంలోకే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించారు. అంబేడ్కర్ మనువడు ప్రకాశ్‌ను ఆహ్వానించారు. అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించారు. ఆ జోష్ సీఎం కేసీఆర్‌లో కొట్టొచ్చినట్టు కనిపించింది. తెలంగాణలో రాబోయేది మళ్లీ మన ప్రభుత్వమేనని విజయ నినాదం చేశారు. మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలతో దళితులను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అంటూ తేల్చి చెప్పారు. దళితబంధును దేశమంతా అమలు చేస్తామని.. ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.
విగ్రహావిష్కరణ కార్యక్రమ వేదికగా సీఎం కేసీఆర్ మరో ప్రకటన కూడా చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాతీయ స్థాయి అవార్ ఇస్తామని చెప్పారు. అవార్డు కోసం 51 కోట్లతో శాశ్వత నిధి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఏటా అంబేడ్కర్ జయంతి రోజున అవార్డు ప్రదానం చేస్తామన్నారు. దళితుల అభ్యున్నతికి పాటుపడే వారికి అంబేడ్కర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ప్రముఖ దళితనేత కత్తి పద్మారావు సూచన మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంబేడ్కర్ విశ్వమానవుడని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణగారిన వర్గాలకు ఆయన ఆశాజ్యోతి అని అన్నారు కేసీఆర్. ఎవరో చెబితే అంబేడ్కర్ విగ్రహం పెట్టలేదని, విగ్రహం ఏర్పాటు వెనుక బలమైన మెసేజ్ ఉందని చెప్పారు. అది విగ్రహం మాత్రమే కాదని, ఒక విప్లవం అని అన్నారు సీఎం కేసీఆర్. అంబేడ్కర్ సందేశం భావితరాలకు అందాలన్నారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేసేలా.. ఆయన పేరును సచివాలయానికి పెట్టినట్టు చెప్పారు.
మరోవైపు.. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో కేసీఆర్ కొత్త శకానికి నాంది పలికారని ప్రశంసించారు ప్రకాశ్ అంబేడ్కర్. బీఆర్ అంబేడ్కర్ కలలుగన్న ఆశయాలు సాధించినప్పుడే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు అంబేడ్కర్ భావాజాలం అవసరమని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో దళితుల అభివృద్ధికి తీసుకొచ్చిన దళితబంధు పథకం ఎంతో గొప్పదని కొనియాడారు. కేసీఆర్ జాతీయ నేతగా ఎదగాలని ప్రకాశ్ అంబేడ్కర్ ఆకాంక్షించారు.