బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట. ఆయన ఎత్తులు వేస్తే ప్రత్యర్థులు చిత్తవ్వాల్సిందే. కానీ, ఒక్కోసారి ఆయన వేసిన ప్రణాళికలు సైతం బెడిసికొడుతుంటాయి. గత ఎన్నికల్లో గులాబీ బాస్ రచించిన వ్యూహం ఫలించలేదు తాజాగా నిన్న అసెంబ్లీలోనూ ఆయన వ్యూహం బెడిసికొట్టినట్టు తెలుస్తున్నది. అందుకే ఆయన సమావేశాల్లో పాల్గొనకుండానే కేవలం రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయినట్టు టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి రావడంతో అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు నాయకులు సైతం ఖుషీ అయ్యారు.కానీ, ఆయన వెళ్లిపోవడంతో వారంతా నిరాశ చెందినట్టు తెలుస్తున్నది.
కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావడంతో తమకు మంచి రోజులు వచ్చాయని ఓ వైపు గులాబీ శ్రేణులు, ఆ పార్టీని అభిమానించే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అసెంబ్లీకి రావాలని సభలో తమ సమస్యలపై చర్చించాలని చాలా మంది కోరుకుంటున్నట్టు తెలుస్తున్నది. అందులో అన్నదాతలే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. కారు పార్టీకి గ్రామాల్లో ఇంకా బలమైన పట్టు ఉంది. యూరియాపై అసెంబ్లీలో ప్రశ్నించాలని పలువురు అన్నదాతలు కోరుతున్నట్టు సమాచారం. నిన్న జీరో అవర్ అనంతరం శాసనసభ, మండలి జనవరి 2వ తేదీకి వాయిదా పడ్డాయి. 7వ తారీఖు వరకు వింటర్ సెషన్స్ కొనసాగనున్నాయి. వీటికి కేసీఆర్ హాజరవుతారా? అనే దానిపై అస్పష్టత నెలకొంది.
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో నదీ జలాలపైనే ప్రధాన చర్చ ఉంటుందని సీఎం రేవంత్ ముందే హింట్ ఇచ్చారు. నిన్న బీఏసీ సమావేశంలోనూ ప్రధాన ఎజెండాగా ఫిక్స్ చేశారు. అసెంబ్లీకి సభ్యులందరూ హాజరవ్వాలని, ప్రిపేర్ అయ్యి రావాలని సీఎం రేవంత్ నిన్న మంత్రులు, విప్‌లకు ఆదేశాలిచ్చారు. ప్రతిపక్షాలు అడిగే ప్రతిదానికి ఆధారాలతో సమాధానాలు ఇవ్వాలని స్పష్టంచేశారు. కేసీఆర్ సభకు వస్తే గత ప్రభుత్వ హయాంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు,తప్పులు, ఒప్పందాలు, నిధుల వృథాలపై నిలదీయాలని సీఎం రేవంత్, మంత్రులు కసరత్తు చేస్తున్నారు. కాగా, కేసీఆర్ హాజరవుతారా? కేటీఆర్, హరీశ్ మీదే భారం వేస్తారా? అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది.
ఇంతకాలం మాజీ సీఎం బయటకు రావడం లేదని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రజలు భావించారు. ఒక్కసారిగా బయటకు వచ్చిన కేసీఆర్.. మీకు నేనున్నా అంటూ సంకేతాలు పంపించారు.కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తున్నదని నమ్మించే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండలో పెద్దఎత్తున సభలకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలోనూ కేసీఆర్ పులిలా గర్జిస్తారని గులాబీ శ్రేణులు, ప్రజలు భావించారు. కేసీఆర్ సైతం ప్రజల నుంచి ఇదే అటెన్షన్ ఆశించారు.అందుకే ఆయన అసెంబ్లీకి వచ్చినట్టు తెలిసింది. నిన్న సెషన్స్ జరిగితే తానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవాలని, ఇటీవల రేవంత్ పరుష పదజాలంతో తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలని అంతా భావించారు. ఇద్దరి మధ్య టగ్గాఫ్ వార్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ రేవంత్ సభలోకి రాగానే కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయన యోగా క్షేమాలు అడిగి తెలుసుకుని షేక్ హ్యాండ్ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయ్యింది. రేవంత్ సంస్కారానికి, వినయానికి బీఆర్ఎస్ సభ్యులు సైతం ఫిదా అయినట్టు సమాచారం. కేసీఆర్ ఎత్తులు రేవంత్ ముందు చిత్తయ్యాయని చర్చ జరుగుతున్నది. వైఎస్ వలే ఫ్రెండ్లీ రాజకీయాలను రేవంత్ పాటిస్తున్నారని పలువురు కితాబిచ్చారు.