CM Revanth reddy: ఓటరు జాబితాల సమగ్ర సవరణ-SIR ప్రక్రియతోపాటు రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారు. నాకు ఎక్కడైనా రెండు ఓట్లు ఉన్నట్లు ఆధారాలుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. బలిసి ఏది పడితే అది మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.
గ్లోబరీనా సంస్థపై నోరు విప్పిన సీఎం- అదే సమయంలో గ్లోబరీనా అనేది కేటీఆర్ బినామీ సంస్థగా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు. ఆ సంస్థ తప్పిదాల వల్ల 27 మంది విద్యార్థులు చనిపోయారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గ్లోబారినా సంస్థ మార్చుకొని CBSE పరీక్షల కాంట్రాక్టు పొందారని వివరించారు. ఈ విషయంలో కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు.
దీని ఆధారంగా నీట్ కుంభకోణం జరిగిందని, పరువు ఉన్నవాడు పరువు నష్టం దావా వేస్తాడని చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఫిర్యాదు చేస్తే జన్వాడ భూములు ఏ రాజుల నుండి వచ్చాయో బయటకి తెస్తామన్నారు. విచారణలో గ్లోబరీనా ఏ రాజులదో బయటకు తెస్తామన్నారు.
కేటీఆర్ బర్త్ డే పై సీఎం సెటైర్-కేటీఆర్ బర్త్ డేపై సెటైర్లు వేశారు. కేటీఆర్ ది రేపు దావత్ ఇస్తా అంటే విష్ చేస్తానని, దావత్ తీసుకోవాలంటే డౌటుగా ఉందన్నారు. అందులో ఏం కలుపుతారో ఏంటి అని చమత్కరించారు. మేము తెరచిన ధర్నా చౌక్‌లో కేటీఆర్ ధర్నా చేస్తున్నారని, శాంతియుతంగా ధర్నా చేస్తే సమస్య ఉండదన్నారు. కేటీఆర్ ధర్నా చెయ్యడానికి చివరికి ధర్నా చౌక్ దిక్కు అయ్యిందన్నారు.
రక్తం ధార పోస్తామని అంటారని, చుక్క రక్తం కుటుంబ సభ్యులు ఇవ్వలేదన్నారు. పేద కార్యకర్తల రక్తం సేకరించారని, మరి ఆ రక్తం ఎక్కడ అమ్ముకున్నారో లెక్క తేలాలన్నారు. బీఆర్ఎస్ భవన్ లో కార్యకర్తల నుండి సేకరించిన రక్తం ఉస్మానియా లేకుంటే గాంధీ కో పంపాలి కదా అని అన్నారు.
ట్రంప్ కంపెనీ పెట్టుబడులు పెట్టారు కాబట్టి రోడ్డుకి ఆయన పేరుకు అనుమతి ఇచ్చామన్నారు. హైడ్రా మంచి సర్వీస్ చేస్తోందని, రెండేళ్లలో కోట్లాది భూములను ప్రొటెక్ట్ చేసిందన్నారు. దీనిబట్టి హైడ్రా అవసరం ఎంతుందో తెలిసిపోతుందన్నారు. నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా అన్నట్లుగా బీఆర్ఎస్ వైఖరి ఉందన్నారు. నేను కక్ష సాధింపునకు దూరమని మనసులోని మాట మరోసారి బయటపెట్టారు.
మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి- తెలంగాణ శాసనసభలో పునర్నిర్మాణం పనులను గురువారం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆ తర్వాత అసెంబ్లీ ఆవరణలో జర్నలిస్టుల చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ వస్తున్న విమర్శలపై నోరు విప్పారు. నాకు ఎక్కడైనా రెండు ఓట్లు ఉన్నట్లు ఆధారాలుంటే ధైర్యంగా వెళ్లి ఫిర్యాదు చేయాలన్నారు. తాను ఓటు నిబంధనల ప్రకారమే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసినట్టు చెప్పారు.
రెండు ఓట్ల వ్యవహారం ఘాటు వ్యాఖ్యలు- గతంలో కొడంగల్, గద్వాల, అలంపూర్ ప్రాంతాలు కర్ణాటక పరిధిలో ఉండేవని గుర్తు చేశారు. చరిత్ర తెలియకుండా బలిసి ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తండాల్లో ఉండేవారు గిరిజన ప్రజలు జీవనోపాధని, వృత్తి రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారని అన్నారు. ఓటింగ్ సమయంలో తమ స్వగ్రామాలకు వస్తుంటారని వివరించారు. అలాంటి పేద ప్రజల ఓట్లు జాబితా గల్లంతు కాకుండా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు లక్ష్యంగా చేసుకుని తొలగించే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఓటరు ఇల్లు ఎక్కడుంది? ఎక్కడ నివాసం ఉంటున్నారు? స్పష్టమైన సమాచారం బూత్ లెవల్ ఏజెంట్లకు తెలుస్తుందన్నారు. సర్‌లో అర్హులైన ఓటు ఎవరిది పోవద్దన్నారు. అందుకే మా నాయకులను మూడో తేదీ వరకు ఎవరి ప్రాంతంలో వారే ఉండాలని ఆదేశించానని గుర్తు చేశారు.
ALSO READ: దేశమంతా రుతుపవనాల జోరు.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు
ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో నిజమైన ఓటర్లను తొలగించే ప్రక్రియ జరగకూడదన్నారు. ప్రక్షాళన ప్రక్రియపై అధికారులు, యంత్రాంగం దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో 70 శాతం సర్వే పూర్తి అయినట్టు సూచనప్రాయంగా చెప్పారు. ఇంకా 30 శాతం సవరణ జరగాల్సి ఉందని, పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లు పూనుకుంటేనే విజయవంతంగా పూర్తి అవుతుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.