KCR BRS:త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగింది.ఈ సందర్బంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకూడదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
అనుసరించాల్సిన వ్యూహం
ఇక దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగత అంశాల కంటే ప్రజల సమస్యలే ప్రధాన అజెండాగా ఉండాలని కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించినట్లు సమాచారం.
ఇక ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభకు తప్పకుండా హాజరై చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా సభలో తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని ఆయన సూచించినట్లు తెలుస్తుంది.
ఇక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో లోపాలు ఉంటే వాటిని ఆధారాలతో సభ దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు సంధించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం .
సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు
ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసినట్లు తెలుస్తుంది.. పాలనపై ప్రశ్నలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ బూతులతో దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, అందుకే రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారిందని ,కాంగ్రెస్ పాలనపై ప్రజలకు ఇప్పటికే ఒక స్పష్టమైన అభిప్రాయం వచ్చిందని, భవిష్యత్తులో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవన్న కామెంట్స్ చేశారట కేసీఆర్.ప్రభుత్వం అవినీతి, దోపిడీకి పాల్పడుతోందన్న ఆరోపణలను కూడా కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
మరోవైపు తనపై ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపైనా కేసీఆర్ స్పందించినట్లు సమాచారం. తనను అసెంబ్లీకి రావాలని పదేపదే డిమాండ్ చేయడం, తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం.
వ్యక్తిగత విమర్శలకు సమాధానం ఇవ్వడం కంటే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం నుంచి పాలమూరు వరకు భారీ పాదయాత్ర
అసెంబ్లీ స్పీకర్ వ్యవహారశైలిపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. సభలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే భావన కలిగితే దానిని ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
సభా హక్కులు, ప్రతిపక్షంగా తమకు ఉన్న అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన చెప్పినట్లు సమాచారం.
అంతే కాకుండా కాళేశ్వరం నుంచి పాలమూరు వరకు భారీ పాదయాత్ర చేపట్టే ఆలోచనను కూడా కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. లక్ష మందితో పాదయాత్ర నిర్వహించే అంశంపై పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారట కూడా.
Also read :తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ గులాబీ దళంలో ఉత్కంఠ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా..?
మొత్తంగా ఎర్రవల్లిలో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం రాబోయే అసెంబ్లీ సమావేశాలకు పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసే దిశగా సాగినట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ప్రభుత్వం పై యుద్దానికి సిద్ధం కావాలంటున్న కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వచ్చి ఆ యుద్ధంలో పాల్గొంటారో లేదో !