CM Revanth Reddy: డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లెక్కలు, లాజిక్కులతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి కడుతుంటే.. తెలంగాణకు తిరిగి వచ్చేది మాత్రం కేవలం 42 పైసలేనని చెప్పారు. పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రాలు భారీగా చెల్లిస్తున్నా తక్కువ మొత్తమే పొందుతున్నట్లు తెలిపారు. చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
తమిళనాడులో రూపాయి కేంద్రానికి చెల్లిస్తే కేవలం 26 పైసలు మాత్రమే రాష్ట్ర వాటాగా పొందుతోంది. కర్ణాటకలో రూపాయికి 16 పైసలు, తెలంగాణ 42 పైసలు, కేరళ 49 పైసలు వస్తున్నాయి. అయితే, బిహార్ మాత్రం రూపాయి కేంద్రానికి చెల్లిస్తే.. ఏకంగా 6 రూపాయల 6 పైసలు రిటర్న్‌లో పొందుతోందని ఆసక్తికర లెక్కలు చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. ఉత్తర ప్రదేశ్ స్టేట్ రూపాయికి రూ.2.03, మధ్యప్రదేశ్ రూ.1.73 మేర లాభపడుతోందని చెప్పారు. దక్షిణాధికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీశారు సీఎం రేవంత్. బీజేపీ జనాభా జరిమానాల విధానాన్ని కొనసాగిస్తోందని తప్పుబట్టారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్ను చెల్లింపులు క్రమంగా తగ్గిస్తోందని అన్నారు. దేశ ఖజానాకు సౌత్ ఇండియా స్టేట్స్ పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ.. తిరిగి తక్కువ నిధులను మాత్రమే పొందుతున్నామని చెప్పారు.
ఇందిరాగాంధీ, వాజ్‌పేయిలు చేసినట్టే..
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం, 2001లో వాజ్‌పేయీ సర్కారు అలానే చేసిందని గుర్తు చేశారు. అలా కాదని, మోదీ ప్రభుత్వం సీట్ల సంఖ్యను మారిస్తే.. రాష్ట్రాల మధ్య రాజకీయ అసమతుల్యాలు తలెత్తుతాయని హెచ్చరించారు. బీజేపీ ప్రతిపాదిస్తున్న జనాభా దామాషా పద్దతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. అలా చేస్తే.. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం దేశంపై పెరుగుతుందని అన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని.. జనాభా దామాషా ప్రాతిపదిక డీలిమిటేషన్‌కు దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకమని సీఎం రేవంత్ గట్టిగా చెప్పారు. ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర మన దేశంలో ఉందని గుర్తు చేశారు. అందుకే, సౌత్ ఇండియన్ పార్టీలు, ప్రజలు ఏకమై కేంద్రంపై పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. పునర్విభజన ప్రక్రియపై నెక్ట్స్ మీటింగ్ హైదరాబాద్‌లో నిర్వహిస్తామని.. ఒక భారీ బహిరంగ సభను సైతం పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు.
చెన్నై అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన డిమాండ్లు:
⦿ 25 ఏళ్ల పాటు లోక్‌సభ సీట్లలో ఎలాంటి మార్పులు తీసుకురావద్దు.
⦿ పార్లమెంట్ సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలి.
⦿ పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకోని.. ఆ స్టేట్‌లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలి.
⦿ పునర్విభజన తర్వాత లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు ఇవ్వాలి.
⦿ రాష్ట్రాల్లోని నగర, గ్రామ జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల హద్దులను మార్చాలి.
⦿ లేటెస్ట్ జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలి.
⦿ మహిళలకు ప్రతి రాష్ట్రంలో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.