Mohan Lal: ప్రముఖ మలయాళ నటులు మోహన్ లాల్ (Mohan Lal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 47 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటూ బిజీగా మారిపోయారు. ఇకపోతే మలయాళం మీద ఎక్కువ మక్కువతోనే ఇక్కడ ఎక్కువ సినిమాలు చేశానని, ఈ కారణం చేతే బాలీవుడ్ లో కూడా పెద్దగా అవకాశాలు అందుకోవడం లేదు అంటూ తెలిపిన ఈయన.. తాజాగా మలయాళ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) .. దర్శకత్వంలో ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ అనే సినిమా చేస్తున్నారు. ‘లూసిఫర్’ సినిమాకు రీమేక్ గా వస్తోంది ఈ చిత్రం. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు ప్రమోషన్స్ కూడా జోరుగా చేపట్టారు మేకర్స్.
మోహన్ లాల్ రెమ్యూనరేషన్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాదులో కూడా ప్రమోషన్స్ చేపట్టారు. అందులో భాగంగానే ప్రెస్ మీట్ లో మోహన్ లాల్ తో పాటు ఈ చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొన్నారు. డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ..” ఈ లూసిఫర్ 2 ఎంపురాన్ సినిమా రూపుదిద్దుకోవడానికి కారణం మోహన్ లాల్. ఆయన ప్రోత్సాహంతోనే ఈ సినిమా ఇప్పుడు త్వరలో మీ ముందుకు రాబోతోంది. ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా కోసం మోహన్ లాల్ ఒక రూపాయి కూడా తీసుకోవడం లేదు. ఆయన పారితోషకంని కూడా సినిమా పైనే పెట్టేశారు. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ తో అభిమానుల అభిరుచికి తగ్గట్టుగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాము. కచ్చితంగా ఈ సినిమా అందరినీ ఆకర్షిస్తుంది” అంటూ తెలిపారు పృథ్విరాజ్ సుకుమారన్.
నా ఈ సక్సెస్ కి కారణం వారే – మోహన్ లాల్..
ఇదే ప్రెస్ మీట్ లో మోహన్ లాల్ మాట్లాడుతూ..” నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 47 సంవత్సరాలవుతుంది. ఇప్పటికీ కూడా ఇంతే సక్సెస్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాను అంటే దానికి కారణం నా సినిమాల కోసం పనిచేసిన నటీనటులు,దర్శక నిర్మాతలే. వారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఇకపోతే నేను ఎన్నో సినిమాలు చేశాను. ఆ సినిమాల్లో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే నాకు మలయాళం సినిమా ఇండస్ట్రీ మీద ఆసక్తి మక్కువ ఎక్కువ. ఆ కారణంగానే అటు హిందీలో కూడా ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాను” అంటూ మోహన్ లాల్ తెలిపారు. మొత్తానికైతే మోహన్ లాల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈ సినిమా కోసం ఆయన ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండా ఉచితంగా నటిస్తుండడం పై అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ లూసిఫర్ 2 ఎంపురాన్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. లూసిఫర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మోహన్ లాల్ లూసిఫర్ 2 ఎంపురాన్ మూవీతో అంతకుమించి సక్సెస్ అందుకుంటారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.