CM Revanth Reddy : మా కళ్లల్లోకి చూసేందుకు కేసీఆర్ భయ పడుతున్నారని.. వరంగల్ సభలో తన పేరు కూడా పలకలేకపోయారంటూ.. గులాబీ అధినేతపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు వరంగల్ వెళ్లారన్నారు. ఆయన మాటల్లో, కళ్లల్లో విషం కనిపిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీకి రాని కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు సీఎం రేవంత్. తాము పదేళ్లు అధికారంలో ఉంటామని.. బీఆర్ఎస్ పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉంటుందన్నారు.
ప్రతిపక్ష హోదా ఎందుకు?
16 నెలలుగా కేసీఆర్ రూ. 65 లక్షల జీతం తీసుకున్నారని.. బంగ్లా, కారు, వసతులు, పోలీస్ భద్రత అనుభవిస్తున్నారని.. కానీ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించకుండా ఫాంహౌజ్‌లోనే ఉంటున్నారని తప్పుబట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఫాంహౌజ్‌లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని.. ఏ పని చేయకుండా జీతం తీసుకోవడం ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. అసెంబ్లీకి రానప్పుడు ఆయనెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని.. సభకు రాకుండా తమని ప్రశ్నించే నైతిక హక్కు ఆయనకు ఎవరిచ్చారని నిలదీశారు. తమ కళ్లల్లోకి చూసేందుకు భయం ఉంటే.. ఇక కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకన్నారు రేవంత్.
కేసీఆర్ కడుపు నిండా విషం..
సంక్షేమ పథకాలు ఆగిపోయాయని కేసీఆర్ అన్నారని.. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వీటిలో ఏ పథకం ఆగిపోయిందంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని.. ఇవేవీ ఆయన కంటికి కనిపించడం లేదా అన్నారు. కేసీఆర్ ఏ మత్తులో తూగుతున్నారో ఆయనకే తెలియాలన్నారు. కడుపు నిండా విషం పెట్టుకుని విధ్వేష పూరిత ప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు.
చర్చకు సవాల్
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేద్దాం రండి అంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, 60 వేల ఉద్యోగ నియామకాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన,, వీటిలో దేనికైనా చర్చకు సై అన్నారు.
నా పేరు కూడా పలకలేక..
తెలంగాణకు కాంగ్రెస్సే విలన్ అంటూ వరంగల్ సభలో కేసీఆర్ చేసిన కామెంట్‌పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అని నిలదీశారు. పదేళ్లు దోచుకున్న కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదన్నారు. వరంగల్ సభలో తన పేరు కూడా పలకలేక పోయారన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.