British High Commissioner: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌తో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో విద్య, టెక్నాలజీ, పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి కూడా హాజరయ్యారు.
చెవెనింగ్ స్కాలర్‌షిప్ తెలంగాణ విద్యార్థులకు
ప్రతిష్టాత్మకమైన చెవెనింగ్ స్కాలర్‌షిప్‌ను కో-ఫండింగ్ విధానంలో.. తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ అంగీకరించారు. యూకే యూనివర్సిటీలలో ఉన్నత చదువులు కొనసాగించాలనుకునే.. ప్రతిభావంతులైన తెలంగాణ విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశమని సమావేశంలో హైలైట్ చేశారు.
విద్య, టెక్నాలజీ రంగాల్లో సహకారం
బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ మాట్లాడుతూ, విద్యా రంగంలో సంయుక్త కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. యూకేలోని విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ నుంచే ఆపరేట్ అయ్యేలా వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దీని ద్వారా తెలంగాణ విద్యార్థులు ఎక్కువ అవకాశాలు పొందగలరని పేర్కొన్నారు.
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ – బ్రిటన్‌కు పరిచయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో తీసుకురాబోతున్న కొత్త విద్యా విధానంపై.. బ్రిటిష్ హైకమిషనర్‌కు వివరాలు అందించారు. ఈ పాలసీ ద్వారా తెలంగాణలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి మార్పులు చేపట్టనున్నట్లు చెప్పారు.
ముసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
హైదరాబాద్‌లో ముసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధి పనుల్లో.. బ్రిటిష్ కంపెనీల భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి కోరారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగరానికి కొత్త ఆకర్షణలు, పర్యావరణహితం ఆర్థిక వృద్ధికి దోహదం కానున్నట్లు పేర్కొన్నారు.
పెట్టుబడులకు ఆహ్వానం
ఫార్మా, జీసీసీ (గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్), నాలెడ్జ్ అకాడమీ రంగాల్లో.. బ్రిటిష్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇన్నోవేషన్, టెక్నాలజీ, రీసెర్చ్‌కి తగిన వసతులు ఉన్నాయని, బ్రిటన్‌తో భాగస్వామ్యం పెంచడం ద్వారా.. ఇరు దేశాలకు లాభాలు కలుగుతాయని ఆయన వివరించారు.
బ్రిటిష్ హైకమిషనర్ సానుకూల స్పందన
ముఖ్యమంత్రి చేసిన అన్ని ప్రతిపాదనలపై.. బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణతో యూకేకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలపర్చుకోవాలని, విద్య, టెక్నాలజీతో పాటు.. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కూడా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Also Read: భారీగా నాన్ డ్యూటి పెయిడ్ మద్యం పట్టివేత..
ఈ సమావేశం ద్వారా తెలంగాణ-బ్రిటన్ మధ్య సంబంధాలు.. కొత్త దిశలో ముందుకు సాగనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా చెవెనింగ్ స్కాలర్‌షిప్ తెలంగాణ విద్యార్థులకు.. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత చదువుల అవకాశాలను తెరుస్తుంది. ముసీ రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ అభివృద్ధికి నూతన శక్తి ఇవ్వనున్నాయి. విద్యా, పెట్టుబడి రంగాల్లో బ్రిటన్ సహకారం రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి దోహదం చేస్తుందని ఈ భేటీ స్పష్టమైంది.