Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-టిప్పర్ లారీ ఢీకొనడంతో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వారిలో 5 నెలల పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.
చేవేళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై, ఎప్పటికప్పుడు అక్కడ చేపడుతున్న సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని డీజీపీ, సీఎస్‌తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు.
ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు, తగినన్ని అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని సీఎం ఆదేశించారు.
గాయపడిన వారికి తగిన వైద్యం అందించేందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం అదేశించారు.
పరిస్థితి విషమంగా ఉన్న వారందరిని కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని..హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
Also Read: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-ఆర్టీసీ ఢీ.. స్పాట్‌లో 21 మంది మృతి
మరోవైపు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో ఉన్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అవసరమైతే వారందరినీ హైదరాబాద్‌కు తరలించి.. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఉన్నతాధికారులంతా తక్షణమే హాస్పిటల్స్‌కు వెళ్లాలన్న మంత్రి దామోదర్ సూచించారు.