CM Revanth with Janareddy: తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ కగార్ ఎంతవరకు వచ్చింది? ఆ ప్రాంతంలో కీలక మావోయిస్టులు ఉన్నారా? ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కేసీఆర్ ఎందుకన్నారు? తనపై ఉన్న అపవాదు పొగొట్టుకునేందుకు ఆయన ఈ స్కెచ్ వేశారా? తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ వెనుక అసలేం జరుగుతోంది? ఇదే చర్చ తెలంగాణ అంతటా నెలకొంది.
తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో వారం రోజులుగా మావోయిస్టుల కోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది కేంద్రం. ఈ ఆపరేషన్‌లో పదుల సంఖ్యలో మావోలు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. పౌర సంఘాల హక్కుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా ఆపరేషన్ ఆపాలని ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. సామాజిక కోణంలో నక్సలిజాన్ని చూస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఆదివారం వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో జరిగింది. అందులో ఆపరేషన్ కగారు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు మాజీ సీఎం కేసీఆర్. ఈ ఆపరేషన్ కేంద్రం నిలిపి వేయాలని పిలుపునిచ్చారు. బలం ఉందని చంపడం సరికాదని, మావోలతో చర్చలు జరపాలని అన్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇరువురు మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అందులో గుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కగార్, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చించినట్టు సమాచారం. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.
ALSO READ: జగన్ దారిలో కేసీఆర్.. మేం రెడీ అంటున్న మంత్రులు
గతంలో ఉమ్మడి ఏపీలో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం మావోలతో శాంతి చర్చలు జరిపింది. దీని వెనుక అప్పట్లో జానారెడ్డి కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయనను సీఎం రేవంత్‌రెడ్డి కలిసి సలహాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మావోల అంశంపై సానుకూలంగా స్పందించడంతో పౌర హక్కుల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాల్పులు నిలిపివేసి వారితో చర్చలు జరిపితే సమస్య ఓ కొలిక్కి వస్తుందని అంటున్నారు. కేవలం ప్రభుత్వం వైపు నుంచి కాకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పౌర హక్కుల సంఘాలు, మేధావులు, కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మావోల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుందో కొద్దిరోజుల్లో తేలనుంది.
జానారెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి..
ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చలు
నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన శాంతి చర్చల కమిటీ తెలంగాణ నేతలు
కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటామని తెలిపిన సీఎం రేవంత్… pic.twitter.com/Zt8qiEvbAf
— BIG TV Breaking News (@bigtvtelugu) April 28, 2025