CM Revanth Reddy : తెలంగాణాలో రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వనందున యునైటెడ్ బేవరేజెస్ సంస్థ తన కేఎఫ్ బీర్ల సరఫరాను రాష్ట్రంలో నిలిపివేసిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో అనేక ముఖ్యమైన అంశాలపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రేట్లు పెంచాలంటూ చేసే డిమాండ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదని అన్నారు.
తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి.. పారదర్శక విధానం పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టం గా ఉండాలని సూచించిన రేవంత్ రెడ్డి.. కొత్త సంస్థల నుంచి దరఖాస్తులు తీసుకునే ముందు నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. ఆ తర్వాత నెల రోజుల నిర్ణీత గడువు ఇవ్వాలని ఆదేశించారు.
ఇష్టానుసారం.. దరఖాస్తు చేసుకున్న బ్రాండ్లకు పర్మిషన్లు ఇవ్వడం కాదని.. ఆయా కంపెనీల నాణ్యతా ప్రమాణాలు, సరఫరా సామర్థ్యాన్ని పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇప్పటికే టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు.. కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారులకు నాణ్యమైన మందును మాత్రమే సరఫరా చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏ దశలోనూ అజాగ్రత్తగా వ్యవహరించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ.. తన బీర్ల రేట్లను రాష్ట్రంలో 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయమై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరల్ని పరిశీలించాలని సూచించారు. ఆయా రాష్ట్రాల కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.
బేవరేజెస్ సంస్థలకు రేట్ల విషయమై హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ -ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ, నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గత ఏడాదిగా ఎక్సైజ్ శాఖ కు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను క్రమంగా క్లియర్ చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు.
Also read : పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ఎక్సైజ్ కమీషనర్ హరికిరణ్ పాల్గొన్నారు.