CM Revanth Reddy: రాజకీయ నేతల మాదిరిగా జర్నలిస్టుల విశ్వసనీయత వేగంగా సన్నగిల్లుతోందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అందుకే నిజమైన జర్నలిస్టులు లక్ష్మణ రేఖ గీయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నిజమైన జర్నలిస్టులు.. ముసుగు తొడుక్కున్న జర్నలిస్టులను వేరు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబాద్‌లో నవ తెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, ఈ సందర్భంగా మాట్లాడారు. కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారని, ఉప్పు లేని వంట రుచి ఉండదన్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటంలో ఎర్రజెండా కనిపించి నప్పుడే ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల సహకారం ఎంతో ఉందన్నారు. భవిష్యత్ లో కాంగ్రెస్-కమ్యూనిస్టుల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలన్నారు. కాంగ్రెస్- కమ్యూనిస్టులు కలిసి పని చేస్తే ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుందన్నారు.
2004లో ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే విద్యుత్ ఉద్యమాలు లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లింది కమ్యూనిస్టు సోదరులేనని గుర్తుచేశారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రత్యక్షం లేదా పరోక్షంగా సహాయపడ్డారని వివరించారు. కొట్లాడే టప్పుడు ప్రజలు మీ పక్షాన ఉన్నా, నిర్ణయం తీసుకునేటప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీకి అండగా ఉంటే బాగుంటుందన్నారు.
ALSO READ: ఎందుకిలా చేశానంటే.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన డాక్టర్ నమ్రత
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల సహకారం మరువలేనిదని, దీన్ని కొనసాగించడానికి వారి సహాయ సహకారం కావాలన్నారు. మరోసారి తాము అధికారంలోకి వస్తే పేదలకు మంచి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. గతంలో జర్నలిస్టులకు అన్ని రంగాలపై పట్టు ఉండేదన్నారు. ప్రస్తుత రోజుల్లో మీడియాలో వింత పోకడలు వచ్చాయన్నారు.
గతంలో తమ భావజాలాన్ని ప్రజలకు వివరించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పత్రికలను నడిపేవారని అన్నారు. కానీ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు వింత పోకడతో వ్యవహరిస్తున్నాయన్నారు. తమ సంపాదనను కాపాడుకోవడానికి, తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కొన్ని రాజకీయ పత్రికలు పని చేస్తున్నాయని తెలిపారు. దీంతో జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతోందన్నారు.
జర్నలిజం ముసుగులోవున్న కొన్ని రాజకీయ పార్టీల పత్రికల తీరును ప్రజలు నిశితంగా గమనించాలన్నారు. నిజమైన జర్నలిస్టులు సెమినార్లు నిర్వహించి జర్నలిస్ట్ పదానికి డెఫినేషన్ నిర్వచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. గతంలో తాము ప్రెస్ మీట్ లు నిర్వహించినప్పుడు సబ్జెక్టుపై జర్నలిస్టుల నుంచి వివరాలు తీసుకునే వాళ్లమన్నారు.
ఇవాళ వింత పోకడలు వచ్చాయని, వాటికి రాజకీయ పార్టీలు తోడయ్యాయని, చివరకు వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పత్రికలు ఉపయోగపడ్డాయని, ప్రస్తుతం ఆయా సంస్థలు తమ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితి తలెత్తుతోందన్నారు.
ఈరోజుల్లో ఎవడు పడితే వాడే జర్నలిస్టు అని చెప్పుకుంటున్నాడు
అ ఆ ఇ ఈలు రానోడు కూడా జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఇంటి పేరు లెక్క తోక తగిలించుకుంటున్నాడు
అలంటి ఫేక్ జర్నలిస్టులను వేరు చేయాల్సిన అవసరం, నిజమైన జర్నలిస్టులపై ఉంది
– సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/G6DiA4qhAa
— BIG TV Breaking News (@bigtvtelugu) August 1, 2025