Railways new tracks: తరచూ ఆలస్యం.. ట్రైన్లు నిలిచిపోవడం.. ఒక్కో ట్రిప్‌కి గంటల పాటు ఎదురుచూపులు.. ఇవన్నీ మర్చిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయోచ్. ఒక్క నిర్ణయంతో 6 రాష్ట్రాల్లో ప్రయాణం కొత్త దారుల్లో పరుగులు తీయబోతోందట. కేంద్రం నుంచి వచ్చిన తాజా ప్రకటన చూస్తే ఇక రైలు ప్రయాణం అంటే యమ స్పీడ్ గురూ అనే తరహాకు రానుంది. అసలు ఈ మార్పు ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే!
రైల్వే నెట్‌వర్క్ విస్తరణలో ఈ సారి కేంద్రం ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (CCEA) ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయంతో, ఇండియన్ రైల్వే చరిత్రలో మరో పెద్ద మలుపు తిరిగింది. ఒకేసారి 4 భారీ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి, మొత్తం రూ.11,169 కోట్లు ఖర్చు చేసి 574 కిలోమీటర్ల మేర రైలు మార్గాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇది ఆ 6 రాష్ట్రాలకు వరంగా మారనుంది.
ఇండియన్ రైల్వే ప్రస్తుత రోజుల్లో ట్రాఫిక్ భరించలేక కొట్టుమిట్టాడుతుండటంతో, ఈ 4 ప్రాజెక్టులు ఎంతో అవసరమయ్యాయి. 2028-29 నాటికి ఈ పనులు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల రైలు ప్రయాణ సమయం తగ్గడం మాత్రమే కాదు, వాణిజ్య రవాణా వేగం కూడా పెరగనుంది.
ఈ నాలుగు ప్రాజెక్టులు ఎక్కడెక్కడంటే..
ఇటార్సీ – నాగ్‌పూర్ నాలుగవ లైన్ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్): ఇటార్సీ – నాగ్‌పూర్ మార్గం మధ్య భారతదేశానికి ముఖ్యమైన రవాణా మార్గం. ఇప్పటివరకు 3 ట్రాకులే ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు 4వ ట్రాక్‌తో రద్దీ తగ్గి, ప్రయాణ వేగం పెరిగే అవకాశం ఉంది.
ఔరంగాబాద్ (ఛత్రపతి సమ్భాజీనగర్) – పరభణి డబులింగ్ (మహారాష్ట్ర): దశాబ్దాలుగా ఒకే ట్రాక్‌పై నడుస్తున్న ఈ మార్గంలో డబులింగ్ వచ్చేస్తోంది. అటు మారాఠ్వాడా ప్రాంత అభివృద్ధికి ఇది కీలకంగా మారనుంది.
అలువాబారి రోడ్ – న్యూ జల్పాయిగురి (పశ్చిమ బెంగాల్) మూడవ, నాలుగవ లైన్లు: ఉత్తర బెంగాల్ నుంచి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు వెళ్లే ఈ మార్గం ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఇప్పుడు మూడవ, నాలుగవ లైన్లతో ఈ మార్గం ట్రాఫిక్‌ను సమర్థవంతంగా తట్టుకోగలదు.
డాంగోపోసి – జరోలి మల్టీ ట్రాకింగ్ (ఒడిశా, ఝార్ఖండ్): ప్రధానంగా మైనింగ్, పారిశ్రామిక వినియోగానికి కీలకమైన ఈ మార్గంలో మూడవ, నాలుగవ లైన్ల నిర్మాణంతో భారీ సరుకుల రవాణా వేగవంతం కానుంది.
ఈ ప్రాజెక్టుల ప్రభావం ఎక్కడంటే..
ఈ 4 ప్రాజెక్టులు కలిపి 13 జిల్లాలు, 6 రాష్ట్రాల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఝార్ఖండ్.. ఈ రాష్ట్రాల్లోని ప్రయాణికులు, వ్యాపారులు అందరికీ దీని ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.
ఇంకెన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా?
ఈ మార్గాలు పూర్తయ్యాక రైలు రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. ప్రత్యేకించి కార్గో రవాణాకు ఇది అనుకూలంగా మారుతుంది. పారిశ్రామిక ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందతాయి. పెద్దపెద్ద కంపెనీలు తమ సరుకులను సమయానికి సరఫరా చేయగలవు. ప్రజల రాకపోకలకు అధిక వేగంతో, తక్కువ ఖర్చుతో ప్రయోజనం చేకూరుతుంది.
ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే వస్తాయి
ఈ ప్రాజెక్టులు నిర్మాణ దశలో వేలాదిమందికి ఉద్యోగాలు వస్తాయి. కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లు.. అందరికీ అవకాశం ఉంది. నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ, ట్రాక్ మానిటరింగ్, సిగ్నలింగ్ వంటి విభాగాల్లో కూడా ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతాయి.
పర్యావరణ పరంగా కూడా ఉపయోగమే!
ఒకే మార్గంలో అనవసరంగా ఎక్కువ రైళ్లు నడిపి డీజిల్ ఖర్చు పెరిగే పరిస్థితిని నివారించేందుకు ఇది మంచి మార్గం. కొత్త ట్రాక్స్ ద్వారా సమర్థవంతంగా రవాణా సాగిపోతుంది. ఇది పర్యావరణానికి మేలు చేసే అంశం.
2028 నాటికి ఇవన్నీ సిద్ధం అవుతాయా?
అధికారుల ప్రకారం 2028-29 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, భూసేకరణలో జాప్యం లేకపోతే ఈ పనులు వేగంగా పూర్తవుతాయని ఆశిస్తున్నారు. ఇండియన్ రైల్వే ఈ నాలుగు ప్రాజెక్టులతో మరోసారి దేశ అభివృద్ధి రైలు పట్టాలపై సాగిపోతోందని నిరూపించుకుంది. ఒకేసారి 6 రాష్ట్రాల్లో 574 కిలోమీటర్ల రైలు మార్గాలను కలుపుతూ తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్ రవాణాకు పునాది వేసింది. రైల్వే ప్రయాణికులకు, వ్యాపారవేత్తలకు ఇది మంచి వార్త. ఇక మీరు చేసే ప్రయాణాలు మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారబోతున్నాయన్న మాట.