CM Revanth Reddy: మొంథా తుఫాను ప్రభావంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో, అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.
ఇది వరి కోతల సమయం కావడంతో, కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. తుఫాన్ కారణంగా గోల్కొండ, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవడం, పలు రైళ్లను దారి మళ్లించడంపై సీఎం ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Read Also: ఆ జిల్లాలపై మొంథా తుఫాను ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కలెక్టర్ల మార్గదర్శకత్వంలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జలాశయాలు, చెరువుల వద్ద నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని నీటిపారుదల శాఖకు సూచించారు.
లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై రాకపోకలను పూర్తిగా నిషేధించి, బారికేడ్లు ఏర్పాటు చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండటంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున, పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని, వైద్యారోగ్య శాఖ మందులు, వైద్య శిబిరాలతో సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్యారోగ్య, అగ్నిమాపక తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.