RS Praveen Kumar: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీ అయిపోయాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రచారంలో పాల్గొంటూ గెలుపు తమదంటే తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బోరబండలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖయలు చేశారు. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్ దాటి బయటకు పోలేరని.. ఇది నా అడ్డా అని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమాషాలు చేయొద్దని మాట్లాడడంపై ఫైరయ్యారు.
సుమోటు కేసు ఎందుకు పెట్టడం లేదు..?
జూబ్లీహిల్స్ ఏమీ నీ అయ్య జాగీరు కాదంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులను వారి ఇళ్లలో గంజాయి ప్యాకెట్లు వేసి కేసులు పెట్టిస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అలా బెదిరించే బాబా ఫసీయుధ్దిన్ వంటి గుండాలకు గన్ మెన్ లను ఎలా ఇచ్చారని నిలదీశారు. పోలీసులు బహిరంగంగా నవీన్ యాదవ్ బెదిరింపులకు పాల్పడడం, ఓటర్లను భయాందోళనకు గురి చేస్తుంటే సుమోటో కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందే ఇలా ఉంటే, ఆ గుండాలు పొరపాటున ఎన్నికల్లో గెలిస్తే అక్కడ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఓటర్లు ఆలోచించాలని కోరారు. నవంబర్ 11 న మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున వచ్చి ప్రజాస్వామ్య పద్దతిలో రౌడీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. సినీ కార్మికులు, కళను నమ్ముకొని బతికే కళాకారులు రేవంత్ రెడ్డి వంటి ఫేక్ ఆర్టిస్టులను గుర్తించాలని, వారితో జాగ్రత్తగా ఉండాలని తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి ఫేక్ ఆర్టిస్టుల హామీలను నమ్మి మోసపోవద్దని అన్నారు.
ALSO READ: CM Revanth Reddy:మొంథా తుపానుపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
నిన్న జరిగిన సినీ కార్మికుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ఫేక్ ఆర్టిస్టు వచ్చి రసవత్తర ప్రదర్శన చేశారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా.. ఇప్పటికీ ఒక్క ఇటుక కూడా పెట్టలేదని ఫైరయ్యారు. ఆయన సొంత నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ కట్టడానికి గుంత తీసి వదిలేశారని గుర్తుచేశారు. అలాంటి పాలకులు సినీ కార్మికుల కోసం ఉచిత పాఠశాల నిర్మిస్తామంటే ఎలా నమ్ముతారన్నారు.
ALSO READ: Dornakal Station: పట్టాలపైకి వరద నీరు.. ఆ రూట్లో రైళ్లు రద్దు
టికెట్ల ధరలు పెంచగా వచ్చిన లాభాల్లో 20 శాతం కార్మికులకు ఇవ్వాలన్న ఆలోచన జూబ్లిహిల్స్ ఎన్నికల ముందే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలకులు వాటాలు పంచివ్వడం పక్కనపెడితే.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే కార్మికుల దగ్గర మామూళ్లు వసూలు చేయకుండా ఉంటే చాలని ఎద్దేవా చేశారు. వాటా పంచే పాలకులు కాదు.. మామూళ్లు వసూలు చేసే రౌడీలు అని సంచలన విమర్శలు చేశారు. అందుకే వారి మాటలు నమ్మి మోసపోయి తర్వాత బాధపడొద్దని.. జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన సినీ కార్మికులను కోరారు.