Heavy Rains: మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైలు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల ఫలితంగా డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ఆయా రైళ్లలోని ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఈ పరిస్థితిపై మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ తక్షణమే స్పందించారు. రైళ్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు, మహబూబాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, రూరల్ సీఐ సరవయ్య, డోర్నకల్ సీఐ చంద్రమౌళి, ఇతర ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది వెంటనే రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు.
ALSO READ: CM Revanth Reddy:మొంథా తుపానుపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
రైలు బోగీలలో ఉన్న ప్రయాణికులకు పోలీసు సిబ్బంది మానవతా దృక్పథంతో సేవలు అందించారు. వారు ప్రయాణికులకు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు పంపిణీ చేశారు. రైలు ఆలస్యం కావడంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు పోలీసులు సకాలంలో అందించిన ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ మాట్లాడుతూ.. మహబూబాబాద్ పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటారని భరోసా ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అవసరమైతే ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే పోలీసుల ప్రధాన ధ్యేయమని, వర్షం వంటి విపత్తు సమయాల్లో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
భారీ వర్షాల సమయంలో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు మానవతా దృక్పథంతో స్పందించి సహాయం అందించిన మహబూబాబాద్ జిల్లా పోలీసులను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. ఆపదలో ఆదుకున్న పోలీస్ సిబ్బంది కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.