CM Revanth Reddy: ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ కొనసాగిస్తోందని చెప్పారు. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడిని నియమించిన ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారు. సోషల్ వెల్ఫేర్ గురుకులాల విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఈ రోజు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి. ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలుగు యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నామని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ‘మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారు. జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాలేదు. మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చింది’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
‘దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఆత్మన్యూనత భావాన్ని వీడాలి. వారిలో ఆత్మన్యూనత భావాన్ని తొలగించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు ఇచ్చారు. కానీ చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని ఎందుకు చెప్పలేదు? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది వాస్తవం కాదా? కానీ మేం మొదటి ఏడాదిలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం’ అని చెప్పారు.
ALSO READ: DDA Recruitment: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో 1383ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రారంభమైంది..
మొదటి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశాం. కానీ నోటికాడి కూడును కిందపడేసినట్లు.. రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. పదేళ్లలో గ్రూప్ -1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. అందుకే ఇది సామాజిక సమస్యగా మారుతోంది. వాళ్లింట్లో ఎన్నికల్లో ఓడిపోతే ఆరు నెలలు తిరగకుండానే ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారు. కానీ యువతకు మాత్రం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారు’ అని సీఎం ఫైరయ్యారు.
మొదటి పాతికేళ్ల వయసు వరకు బాగా చదువుకుంటేనే మీరు మీ జీవితంలో రాణిస్తారు. తప్పుదారి పడితే కన్న తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ తెచ్చుకోవద్దు. కష్టపడండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో రాణించి తల్లిదండ్రులకే కాదు.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలి. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడిని నియమించిన ఘనత ఈ ప్రభుత్వానిది. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించాం. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రజా ప్రభుత్వంలో ఎంపిక చేసుకున్నాం’ అని సీఎం చెప్పారు.
‘వీళ్ళందరికీ కేవలం కులం ప్రాతిపదికన గుర్తింపు రాలేదు.. చదువుకున్నారు కాబట్టే వారికి గుర్తింపు వచ్చింది. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. అన్ని రంగాల్లో మీరు రాణించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.