Hydra: హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులను పురస్కరించుకుంటూ హైకోర్టు హైడ్రాపై ప్రశంసలు కురిపించింది. చెరువులను కాపాడడమే కాదు, వాటిని సుందరంగా తీర్చిదిద్దుతూ నగర వాతావరణాన్ని మార్చేస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైకోర్టు అభినందన
మాధాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు పరిధిలో టీడీఆర్ కేసు విచారణ సందర్భంగా.. న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి మాట్లాడుతూ హైడ్రా పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తారు. నగరంలో చెరువుల అభివృద్ధిని ఓ యజ్ఞంలా తీసుకొని పనిచేస్తోందని ఆయన అభినందించారు. చెత్త కుప్పలుగా మారిన ప్రాంతాలు ఇప్పుడు అందంగా మారాయి అని జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి పేర్కొన్నారు.
బతుకమ్మకుంటకు ప్రత్యేక ప్రస్తావన
జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ముఖ్యంగా బతుకమ్మకుంట అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. ఒకప్పుడు ఆక్రమణలతో చెత్త కుప్పగా మారిన బతుకమ్మకుంట ఇప్పుడు సర్వాంగ సుందరంగా మారి, ప్రజలకు ఆహ్లాదాన్ని ఇస్తోంది అని వ్యాఖ్యానించారు. బతుకమ్మకుంట పునరుద్ధరణతో వర్షాకాలంలో ఆ ప్రాంతంలో వర్షపు నీటి ముప్పు తగ్గిందని, భూగర్భ జలాలు కూడా పెరిగాయని పేర్కొన్నారు. ఇలాంటి పనితీరే నగర భవిష్యత్తుకు దారిని చూపిస్తుంది అని ఆయన చెప్పారు.
మరికొన్ని చెరువుల అభివృద్ధి కొనసాగుతోంది
హైడ్రా ఆధ్వర్యంలో ప్రస్తుతం నగరంలోని గచ్చిబౌలి మల్కం చెరువు, మాధాపూర్ తమ్మిడికుంట చెరువు, శంషాబాద్ సమీపంలోని కొంతమంది చెరువులు, అలాగే నగర పశ్చిమ ప్రాంతంలోని మరో ఐదు చెరువుల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
టీడీఆర్‌పై సరైన విధానం అవసరం
హైకోర్టు తీర్పులో జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ప్రభుత్వం టీడీఆర్ విధానంపై.. సరైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న భూములు, ఇళ్ల స్థలాలు ప్రభుత్వం నియంత్రణలోకి రావడం సహజమని, కానీ ఆ ప్రాంతాల యజమానులకు సరైన పరిహారం ఇవ్వడం తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. స్పష్టమైన టీడీఆర్ విధానం ఉంటేనే చెరువుల అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయి. ఆ విధానం లేకపోతే లిటిగేషన్లు పెరిగి ప్రాజెక్టులు నిలిచిపోతాయి అని ఆయన సూచించారు.
Also Read: బాగా ముదిరిపోయారు.. ఫాంహౌస్‌లో మైనర్ల ట్రాప్‌హౌస్ పార్టీ..?
హైడ్రా చెరువుల పునరుద్ధరణలో చేస్తున్న పనులు నగర పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా.. ప్రజా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తున్నాయి. చెరువుల పునరుద్ధరణతో వర్షపు నీటి నిల్వ పెరుగుతూ, భూగర్భ జలాల స్థాయి మెరుగుపడుతోంది.