BigTV English

Congress: ‘బలగం’.. మనం మనం కాంగ్రెస్ కుటుంబం.. శ్రేణులకు స్ట్రాంగ్ మెసేజ్..

Congress: ‘బలగం’.. మనం మనం కాంగ్రెస్ కుటుంబం.. శ్రేణులకు స్ట్రాంగ్ మెసేజ్..

Congress: కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువే. టి.కాంగ్రెస్‌లో ఏ ఇద్దరు నేతలకు పడదనే ప్రచారం ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు జట్టు కట్టారని అంటారు. వారిలో వారే గోతులు తవ్వుకుంటూ.. పార్టీని ఎదగనీయకుండా చేస్తున్నారనే విమర్శ ఉంది. కానీ.. అలాంటిదేమీ లేదని.. మేమంతా ఒక్కటేనంటూ నల్గొండ నిరుద్యోగ నిరసన సభ వేదికగా బలంగా చాటి చెప్పారు హస్తం నేతలు. వెండితెర బలగంను మరిపించేలా.. రాజకీయ బలగంను ప్రదర్శించారు.


రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, వీహెచ్. ఒకే ఫ్రేమ్‌లో ఆకట్టుకున్నారు. ఒకే దండలో ఒదిగిపోయి మెప్పించారు. పరస్పరం కౌగిలించుకున్నారు. ఒకరినొకరు పొగుడు కున్నారు. మొత్తానికి మునుపెన్నడూ లేని సీన్ చూపించారు. మా మధ్య విభేదాలు లేవంటూ సూటిగా చెప్పారు.

పీసీసీ పీఠంపై కన్నేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఆ పదవి రేవంత్‌రెడ్డికి దక్కడంతో జీర్ణించుకోలేకపోయారనే ప్రచారం జరిగింది. దానికితోడు కొన్ని కొన్ని సందర్భాల్లో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలం చేకూర్చాయనే చెప్పాలి. ఇప్పుడదే కోమటిరెడ్డి.. నల్గొండ జనం సాక్షిగా రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంచేశారు. తొలిసారి నల్గొండకు వచ్చిన రేవంత్‌రెడ్డికి మనసారా స్వాగతం పలికారు. చూట్టానికి పెళ్లికొడుకులా ఉంటారు కానీ.. అప్పుడే తాత కూడా అయ్యారంటూ.. అందుకు కంగ్రాట్స్ చెబుతూ.. తామంతా ఒకే కుటుంబం అనేలా మాట్లాడారు.


రేవంత్‌రెడ్డి ప్రసంగం సైతం గతానికి కాస్త భిన్నంగా సాగింది. తన స్పీచ్‌లో సగం సమయం.. నల్గొండ కాంగ్రెస్ లీడర్లను పొగిడేందుకే కేటాయించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నుంచి కోమటిరెడ్డి వరకు.. నల్గొండ లీడర్లందరినీ తెగ కొనియాడారు. జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి, కోమటిరెడ్డిలు తెలంగాణ ఉద్యమంలో పోషించిన కీలక పాత్రను ప్రజలకు గుర్తు చేశారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదని.. కాంగ్రెస్, కాంగ్రెస్ లీడర్ల వల్లేనని ప్రజలకు వివరించి చెప్పారు. తన మాటలతో నల్గొండ ప్రజల ఆదరణ చూరగొన్నారు రేవంత్‌రెడ్డి.

ఇక నిరుద్యోగ నిరసన సభలో మాట్లాడిన ప్రతీ నాయకుడూ.. కేసీఆర్ పాలనను ఘాటు విమర్శలతో కుమ్మేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. వారు కేసీఆర్‌పై చేసిన ఆరోపణలకంటే కూడా.. పరస్పరం పొగుడుకున్న అంశమే ప్రజలను అత్యంత ఆకట్టుకుంది. ఇది వెండితెర బలగం కాదు.. రియల్ బలగం అంటూ వీహెచ్‌ చేసిన స్టేట్‌మెంట్ ఆ సభకే హైలైట్.

అంతకుముందు కాంగ్రెస్ నేతలంతా కలిసి నిరుద్యోగ నిరసన ర్యాలీ తీశారు. జనం వేలాదిగా తరలివచ్చారు. నల్గొండ రోడ్లు కిక్కిరిసిపోయాయి. జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తాయి. కాంగ్రెస్ నేతలంతా కలిసి ముందడుగు వేస్తే.. జన ప్రభంజనమేనని నల్గొండ సభతో మరోసారి నిరూపితమైంది.

ఇక, కాంగ్రెస్ పార్టీ ముఖ్య లీడర్లంతా నల్గొండలో చేతులు కలపడంతో.. కేడర్ పండగ చేసుకున్నారు. మరి, ఈ సఖ్యత చివరి వరకూ ఉంటుందా? హస్తం నేతలు ముందుముందు కూడా ఇలానే ఐకమత్యంగా ఉంటారా?

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×