Telangana Coal Belt : కాంగ్రెస్ అగ్రనాయకత్వం తెలంగాణపై స్పెషల్ నజర్ పెట్టింది. ఇప్పటికే గెలుపు జోష్‌తో దూసుకుపోతున్న హస్తం నేతలకు మరింత బూస్ట్ ఇచ్చేలా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో వాలిపోయారు. బస్సు, పాదయాత్రలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కోల్‌బెల్ట్‌పై నజర్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఒకేరోజులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ తర్వాత రాహుల్ గాంధీ సింగరేణి కార్మికులతో భేటీ అయ్యి వారి సమస్యలపై చర్చించారు.
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాలు కోల్ బెల్ట్‌లోనే ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా చూస్తే ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలలోని చాలా ప్రాంతాలలో సింగరేటి ఓటర్ల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 42 వేల మంది కార్మికులున్నారు. వీరితో పాటు 20 వేల మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు.. 60 వేల మందికిపైగా పెన్షనర్లున్నారు. వీరంతా ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయిలో మద్ధతు తెలపడం లేదు. దీనికి 2018 ఎన్నికలే ఉదాహరణ. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కోల్‌బెల్ట్ ఏరియాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో సగం కాంగ్రెస్, సగం బీఆర్ఎస్ గెలుచుకున్నాయి.
2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం సింగరేణి ప్రాంత లోక్‌సభ నియోజకవర్గాలైన ఆదిలాబాద్‌లో బీజేపీ గెలవగా.. మిగతా నాలుగు పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కోల్ బెల్ట్‌లో కాంగ్రెస్ ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవలేకపోయింది. అందుకే సింగరేణిపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే కార్మికుల సమస్యలపై గళం విప్పుతోంది కాంగ్రెస్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తున్నాయంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
ములుగు నుండి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రామగుండం బొగ్గు గనుల ప్రాంతాల్లో పర్యటించారు. సింగరేణి కార్మికులతో పాటు రామగుండంలోని NTPC, RFCL, ZENCO సంస్థలకు చెందిన కాంట్రాక్టు కార్మికులతో భేటీ అయ్యారు. సింగరేణి ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వారిలో భరోసా నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ.
సీఎం కేసీఆర్ ఓపెన్ కాస్ట్ గనులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని.. కార్మికుల సంక్షేమాన్ని కూడా గాలికి వదిలేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు చేసిన పోరాటాలు, త్యాగాలను సీఎం కేసీఆర్ మర్చిపోయారని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌కు అనుకున్నన్ని సీట్లు రాకపోయినా.. ఎప్పుడు కార్మికుల వైపే ఉంటూ పోరాడుతున్నామని గుర్తు చేశారు. బీజేపీ గనులను ప్రైవేటు పరం చేయాలనుకుంటుందని.. బీజేపీ దానికి వత్తాసు పలుకుతుందంటూ ఫైర్ అయ్యారు. కారుణ్య నియామకాలు, కొత్త భూగర్భ గనులు ఏర్పాటు చేసి లక్ష మందికి ఉద్యోగాలు కల్పించడం, వేతన సవరణ అమలు చేయకపోవడం లాంటి సమస్యలను తెర మీదకు కార్మికులు తెస్తున్నారు. ఏ పార్టీ తమ సమస్యలను తీరుస్తుందని నమ్ముతారో.. ఆ పార్టీకే సింగరేణి కార్మికుల సపోర్ట్ ఉంటుంది.