Bank Locker : నగలు, విలువైన వస్తువులు, ముఖ్యమైన డాక్యుమెంట్లు సాధారణంగా బ్యాంకు లాకర్‌లో పెడుతూ ఉంటాం. అయితే ఇటీవలి కాలంలో కొందరు బ్యాంకు లాకర్లలో నగదు పెట్టటంతో దేశవ్యాప్తంగా బ్యాంకులన్నింటికి సంబంధించిన లాకర్ల నియమాలను ప్రభుత్వం సవరించింది. తాజాగా ప్రభుత్వం సూచించిన ఆ కొత్త నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం.
బ్యాంక్ లాకర్లలో బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు, ఒప్పంద పత్రాలు వంటివి దాచుకోవచ్చు. అగ్ని ప్రమాదాలు, దొంగతనం, ఉద్యోగులు ఎవరైనా మోసానికి పాల్పడితే జరిగిన నష్టానికి బ్యాంకులదే బాధ్యత.
నిబంధనల ప్రకారం కస్టమర్లు బ్యాంకులో దాచుకున్న వస్తువులు కస్టమర్ల నిర్లక్ష్యం కారణంగా పాడైపోయినా, వాటికి నష్టం వాటిల్లినా దానికి బ్యాంకులు ఎలాంటి బాధ్యత తీసుకోవు. కానీ విపత్తులు, భూకంపాలు, వరదలు వంటివి ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టానికి బ్యాంకులు బాధ్యత వహించవు. అయితే అలాంటి విపత్తుల నుంచి వినియోగదారుల లాకర్లలోని వస్తువులను కాపాడేలా బ్యాంకు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పనిలో నిర్లక్ష్యం వహించినట్లు రుజువైతే బ్యాంకు తగిన పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక నగదు, ఆయుధాలు,పేలుడు పదార్థాలు, డ్రగ్స్ వంటివి లాకర్లలో పెట్టటానికి అనుమతి లేదు. అంతేకాదు అలా చేయటం నేరం కూడా. అలాగే పాడైపోయే గుణం ఉన్న వస్తువులు, రేడియోధార్మిక పదార్థాలు, చోరీ చేసిన వస్తువులకూ అనుమతి లేదు. బ్యాంక్‌కు గానీ, బ్యాంక్ కస్టమర్లకు గానీ ముప్పు, ప్రమాదం కలిగించే పదార్థాలను లాకర్లలో పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.
2021 ఆగస్టు 18న ఆర్బీఐ ప్రకటించిన నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో భద్రపరిచిన వస్తువులకు నష్టం వాటిల్లితే డిపాజిట్ మొత్తానికి 100 రెట్లు ఖాతాదారుడికి చెల్లించాలి. అంటే కస్టమర్ ఏడాదికి రూ. 1000 అద్దె చెల్లిస్తుంటే అతనికి రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ 2022 డిసెంబర్ 31 కంటే ముందు బ్యాంకులతో లాకర్ అగ్రిమెంట్ చేసుకున్న కస్టమర్లు మళ్లీ బ్యాంకుతో కొత్తగా అగ్రిమెంట్ కుదుర్చుకోవాల్సి ఉంటుంది.