Job Scam: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ లోని కొందరు లీడర్లు ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫ్రంటల్ విభాగాల్లో వివిధ రకాల పోస్టుల్లో ఉంటూ పైరవీలకు తెరలేపుతున్నారు. తమకు మంత్రులు, ప్రభుత్వంలోని పెద్దలు తెలుసునంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పైగా పేదలు, అమాయకుల అవసరాన్ని ఆసరా చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూల్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కొందరు బాధితులు గాంధీభవన్ లోనూ ఫిర్యాదు చేయగా, తాజాగా మరి కొందరు పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు.
ఒక వైపు ఆర్ధిక చిక్కుల్లో ఉన్న రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు సీఎం నుంచి మొదలు మంత్రుల వరకు శ్రమిస్తుంటే, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ లోని కొందరు లీడర్లు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా వ్యవహరించడం విచిత్రంగా కనిపిస్తున్నది. నిత్యం సెక్రటేరియట్, మంత్రులు క్వార్టర్స్ లో ప్రత్యక్షమవుతూ, ప్రభుత్వమే తనకు సన్నిహితమనే సంకేతాలను ఆయా పేదలకు ఇస్తున్నారు. దీంతో ఉద్యోగాల నిమిత్తం లీడర్లకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు దాపురించారు. చివరికి మోసపోయిన తర్వాత నాలుక కర్చుకుంటున్నారు. ఇది గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నిత్యకృత్యమవుతున్నది. ఈ అంశంపై పార్టీతో పాటు ప్రభుత్వం కూడా సీరియస్ గా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ నాయకులు అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
అధికార పార్టీ ముసుగులో కొందరు నేతలు సాగిస్తున్న అక్రమ దందా ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే సాధారణ కార్యకర్తలను, ఉపాధి కోసం ఆశగా ఎదురుచూసే పేదలను టార్గెట్ చేస్తూ.. లక్షలాది రూపాయలు గుంజుతున్న వైనం ‘హస్తం’ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. “ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్” (అనుబంధ సంఘాలు) పదవులను అడ్డం పెట్టుకుని, మంత్రుల పేర్లు వాడుకుంటూ కొందరు లీడర్లు సాగిస్తున్న పైరవీల పర్వంపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ లీడర్లు సచివాలయంలోని మంత్రుల లాబీల్లో, చాంబర్లలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ తాము చాలా ‘పవర్‌ఫుల్’ అని కలరింగ్ ఇస్తున్నారు.తమకు సచివాలయంలో తిరుగులేదని చెబుతూ అమాయక ప్రజలను నమ్మపలుకుతున్నారు.
Also read: ఏసీలు, కూలర్లు అక్కర్లేదు.. ఈ 5 రంగులు వేస్తే.. ఇల్లు ఊటీ అయిపోద్ది!
ముఖ్యంగా నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీకి కూడా ఫిర్యాదులు చేరినట్లు టీపీసీసీలోని ఓ ముఖ్య నేత తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు తెరలేపారు. అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్ వంటి పోస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. పోస్టు ప్రాధాన్యత ను బట్టి డబ్బులు తీసుకుంటున్నారు. అయితే రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాలు, తమ పిల్లలకు ఎలాగైనా ఒక ఉద్యోగం వస్తుందనే ఆశతో ఉన్న ఇళ్లను, నగలను తాకట్టు పెట్టి వీరికి డబ్బులు సమర్పించుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత సదరు లీడర్లు ఫోన్లు స్విచ్చాఫ్ చేయడం , బెదిరింపులకు దిగడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది.
ఈ అక్రమ వసూళ్ల భాగోతం కాస్తా ఇప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది.బాధితులు కొందరు సాక్ష్యాధారాలతో సహా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ లో ఫిర్యాదులు చేశారు. ఫ్రంటల్ ఆర్గనైజేషన్లలో కీలక పదవుల్లో ఉంటూ.. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి, ఇలాంటి దందాలకు పాల్పడుతున్న లీడర్ల చిట్టా ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఇలాంటి ‘నయా దందా’ తెరపైకి రావడంపై సీనియర్ నాయకులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కష్టపడి అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వానికి, పార్టీకి ఇలాంటి కొద్దిమంది పైరవీకారుల వల్ల చెడ్డపేరు వస్తోందని క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల పేర్లు వాడుకుంటూ, సెక్రటేరియట్ కేంద్రంగా సాగుతున్న ఈ మోసాలకు అడ్డుకట్ట వేయకపోతే పేదల్లో ప్రభుత్వంపైన, పార్టీపైన నమ్మకం సడులుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
యూత్ కాంగ్రెస్ లో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న భరత్ నాయక్ పై హైదరాబాద్ సరూర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు నమోదైంది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ తనను మోసం చేశారని మహేష్ చెంచు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక ఇదే యూత్ కాంగ్రెస్ నాయకుడికి బత్తుల లక్ష్మీ, జంపయ్య అనే దంపతులు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కొరకు మనీ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఎల్లమ్మ అనే మహిళా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కోసం కూడా భరత్ నాయక్ కు డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చాలా మంది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లీడర్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు చర్చ జరుగుతుంది. పదేళ్ల పవర్ కోసం సీఎం ప్రయత్నిస్తుంటే, క్షేత్రస్థాయిలో ఈ తరహాలో లీడర్లు వ్యవరిస్తే ప్రభుత్వంతో పాటు పార్టీకి నష్టం వాటిల్లనున్నది. సర్కార్ సీరియస్ గా తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
Also read: టైంపాస్ కోసం ఏకంగా విమానాన్ని తయారు చేసిన యూట్యూబర్, నిజంగా వండర్ భయ్యా!