Bike Theft Gang: స్వేచ్చ బ్యూరో: జల్సాలకు డబ్బు కావాలి.. కష్టపడి సంపాదించాలనే ఆలోచన లేదు. దీంతో చోరీలనే సులభ మార్గంగా ఎంచుకున్న నలుగురు యువకులు వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ పోలీసులకు సవాల్ విసిరారు. చివరకు షామీర్‌పేట పోలీసుల అప్రమత్తతతో వారి ఆటకు తెరపడింది. ప్రధాన నిందితుడితో పాటు ముగ్గురు మైనర్లతో కూడిన అంతర్‌జిల్లా వాహన దొంగల ముఠాను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. లక్షల విలువైన 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
షామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జవహర్‌నగర్ ఏసీపీ ఎస్. చక్రపాణి కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మల్కాజిగిరికి చెందిన నల్లగండ్ల నవీన్ రాజ్ అలియాస్ బన్నీ గతంలో వాహన చోరీ కేసుల్లో నిందితుడు. జువైనైల్ హోంలో పరిచయమైన ముగ్గురు మైనర్లతో కలిసి ముఠాగా ఏర్పడి వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. 20 నుంచి 30 ద్విచక్ర వాహనాలను దొంగిలించి ఒకేసారి విక్రయించాలని ప్రణాళిక రూపొందించినట్లు విచారణలో తేలింది.
Also read: రూ.549 ప్లాన్‌కు ఎయిర్‌టెల్ చెక్.. రేసులోకి రూ.449, రూ.699.. ఏది బెస్ట్ ఛాయిస్?
ఈ నెల 17, 18 తేదీల అర్ధరాత్రి తూముకుంట గ్రామంలోని దొంగల మైసమ్మ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితులు రిజిస్ట్రేషన్ నంబర్లు లేని బైక్‌లపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అడ్డుకొని విచారించారు. విచారణలో షామీర్‌పేట, కీసర, కుషాయిగూడ, పేట్ బషీరాబాద్, ఖమ్మం జిల్లా మునుగూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించారు. నిందితుల సమాచారంతో కండ్లకోయలోని సీఎంఆర్ ఆస్పత్రి సమీపంలో దాచిపెట్టిన 9 చోరీ ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వాహనాలు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించినవిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు నవీన్‌ను రిమాండ్‌కు తరలించగా, ముగ్గురు మైనర్లను జువైనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచినట్లు ఏసీపీ తెలిపారు. ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయాలని, హ్యాండిల్ లాక్‌లు తప్పనిసరిగా వినియోగించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ చక్రపాణి సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో షామీర్‌పేట సీఐ కె. నరసింహారెడ్డి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Also read: బండ్లన్న ఇంట మొదలైన పెళ్లి సందడి.. మెగా ఫ్యామిలీకి ప్రత్యేక ఆహ్వానం!