సీఎం సార్.. హ్యాపీ బర్త్‌డే
– ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే
– తెలంగాణ వ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
– తమదైన రీతిలో విషెష్ చెప్తున్న ఫ్యాన్స్
హైదరాబాద్, స్వేచ్ఛ: Happy Birthday CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు ప్రముఖులు, అభిమానులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టు వస్త్రంపై రేవంత్ చిత్రాన్ని నేసి నేత కళాకారుడు అబ్బురపరిచాడు. తన చేనేత కళతో ఎన్నో అద్భుతాలు సృష్టించిన వెల్ది హరిప్రసాద్ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా పట్టు వస్త్రంపై ఆయన చిత్రాన్ని వచ్చేలా నేశాడు.
రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానంతో దాదాపు 5 రోజులపాటు శ్రమించి ఈ వస్త్రాన్ని తయారు చేశానని హరిప్రసాద్ తెలిపాడు. ఇటీవల చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో పాల్గొని, బుల్లి చేనేత మగ్గంపై రేవంత్ చిత్రం వచ్చేలా తయారు చేసిన జ్ఞాపికను రాష్ట్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి అందించాడు.
ఇక, ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో రేవంత్ సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ దీన్ని ఏర్పాటు చేయించి సీఎంకు విషెస్ చెప్పారు. ఇక, నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ తన కళతో సీఎంకు బర్త్‌డే విషెస్ తెలిపారు. రావి ఆకు, అరటి ఆకుపై రేవంత్ చిత్రాన్ని రూపొందించారు. హ్యాపీ బర్త్‌డే ఏఆర్ఆర్ అని తన అభిమానాన్ని చాటుకున్నారు.