Falaknuma train: ఫలక్‌నుమా ట్రైన్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో ట్రైన్ ఆపేశారు. ఆ తర్వాత పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలియగానే జీఆర్పీఎఫ్ పోలీసులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు.
హైరా నుంచి సికింద్రాబాద్ వస్తోంది ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్. ఆ ట్రైన్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే అలర్టయిన రైల్వే పోలీసులు రైలుని ఘట్ కేసర్ వద్ద ఆపేశారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. జీఆర్పీఎఫ్, ఘట్‌కేసర్ పోలీసులు స్టేషన్‌లో రైలుని ఆపి సోదాలు చేపట్టారు.
స్టేషన్‌లోకి ఎవరినీ రాకుండా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత సికింద్రాబాద్ పంపించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఘట్‌కేసర్‌కు రైలు చేరుకుంది. తనిఖీలు తర్వాత ఉగ్రవాదులు ఉన్నారా? లేదా అనేదానిపై క్లారిటీ రానుంది.
ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి వుంది. తనిఖీల తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఘట్‌కేసర్ స్టేషన్‌లో ఎక్కువగా ప్లాట్‌ఫామ్స్ ఉండడంతో ఓ ట్రాక్‌లోకి ఈ రైలుని తీసుకుని సోదాలు చేస్తున్నారు. అదే రూట్లో వెళ్లే రైళ్లకు ఎలాంటి అంతరాయం లేకుండా చేశారు.
ALSO READ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు
ఈ విషయంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేశారు. నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అణువణువుగా ప్రయాణికులను ప్రశ్నించి, టికెట్లు పరిశీలిస్తున్నారు. ఘట్ కేసర్ నుంచి సికింద్రాబాద్‌కు ఆ రైలు రావటానికి ఇంకా సమయం పట్టే అవకాశముందని అంటున్నారు.