Telangana Cabinet: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూపుల్లో ఉన్న ఆ నేతలు.. ఇప్పుడు తెగ హుషారుగా ఉన్నారట. హమ్మయ్య.. ఇక ఎన్నో ఏళ్ల కల తీరబోతుందని కొందరు, మనకు ఆ ఛాన్స్ వస్తుందా అంటూ మరికొందరు ఇప్పటికే వాకబు చేసే పనిలో ఉన్నారట. ఇంతకు ఇంతలా ఆ నేతలు సంబరపడే విషయం ఏమిటంటే.. తెలంగాణ కేబినెట్ విస్తరణ.
సీఎం రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఏడాది పాలన పూర్తి కాగానే కేబినెట్ విస్తరణ జరుగుతుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే ప్రభుత్వం సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేసే పనిలో బిజీ కాగా, సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కూడ బిజీ అయ్యారు. దీనితో కాస్త కేబినెట్ విస్తరణ అంశం కాస్త పక్కకు వెళ్లింది. తాజాగా మరోమారు కేబినెట్ విస్తరణ ఇక ఖాయమనే వార్తలు గుప్పుమన్నాయి.
గురువారం సీఎల్పీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పార్టీ పరమైన అంశాలపై తెలంగాణ ఇంచార్జ్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరై, ఎమ్మెల్యేలకు పలు సూచనలు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. అయితే ఇక్కడే తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి సుదీర్ఘ చర్చ సాగిందని తెలుస్తోంది.
ఇప్పటికే ఆయా ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల వారీగా ఆశావాహుల జాబితాను ఇంచార్జ్ మున్షీ సిద్ధం చేసినట్లు సమాచారం. సాయంత్రం ఢిల్లీకి మున్షీ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ లు వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో రేపు ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణ పై తగిన నిర్ణయం తీసుకొని జాబితాను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Also Read: Bomb Threats: ఎస్వీ యూనివర్శిటీకి మళ్లీ బాంబు బెదిరింపు.. పోలీసులు ఏం చెప్పారంటే?
అందుకే ఆశావాహులు కేబినెట్ లో చోటు దక్కుతుందన్న ఆనందంలో ఉన్నారట. ఎన్నో రోజులుగా ఇదే సమయం కోసం వేచి ఉన్నామని, ఎట్టకేలకు కేబినెట్ విస్తరణలో తమకు చోటుదక్కడం ఖాయమంటూ.. అనుచరులతో చెప్పేస్తున్నారట. మరి కేబినెట్ విస్తరణ సాగితే.. ఆ అదృష్టం ఎవరికి వరించునో..!