Pending Works: స్వేచ్చ బ్యూరో: ‘‘ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు కావోస్తుంది. నియోజకవర్గాల్లో జనాలు నిలదీస్తున్నారు. జర మా వర్క్స్ క్లియర్ చేయండి సార్” అంటూ ఇప్పుడు అధికార పార్టీ శాసన సభ్యులు మంత్రులపై ప్రెజర్ పెంచారు. ఎన్నికల సమయంలో పార్టీ, పర్సనల్ గా తామిచ్చిన హామీలు క్లియర్ అయ్యేందుకు సహకరించాలని శాసన సభ్యులు మంత్రులను కోరుతున్నారు. హామీలు, డెవలప్ మెంట్ కొరకు తామిచ్చిన రిక్వెస్ట్ లను వెంటనే క్లియర్ చేయాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాల పరిమితి దాదాపు 50 శాతానికి పైగా పూర్తి అయింది. దీంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగింది.
తమ పదవి కాలంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చాల్సిన వర్క్స్ ను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ముఖ్యంగా రోడ్లు, ఆసుపత్రులు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ వంటి అంశాలపై నే అత్యధికంగా పట్టుబడుతున్నట్లు మంత్రులు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు,డిక్లరేషన్లు, గ్యారంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలనే కల్పించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సొంతంగా హామీలు గుప్పించారు. అయితే, ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు గడుస్తున్నా.. కొన్ని నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనులకు మోక్షం లభించకపోవడంతో క్షేత్రస్థాయిలో కేడర్ నుంచి ఒత్తిడి తీవ్రమవుతోంది.
“ఇంకా ఎప్పుడు చేస్తాం సార్? జనాలు అడుగుతున్రు..”అంటూ మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనల్లో కార్యకర్తలు నేరుగానే సవాళ్లు విసురుతుండటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తోంది. గతంలో జరిగిన సీఎల్పీ మీటింగ్ లోనూ ఓ సారి ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ ఇప్పటికీ పెండింగ్ లోనే నెలకొన్న నేపథ్యంలో కొందరు శాసన సభ్యులు నియోజకవర్గాలు వదిలి హైదరాబాద్ బాట పట్టారు. మంత్రుల క్వార్టర్స్, సెక్రటేరియట్ లో మినిస్టర్లతో భేటీ అయి, సమయం తక్కువగా ఉన్నదంటూ వేడుకోవడం గమనార్హం. సీఎం జిల్లాల పర్యటనల ద్వారా ఈ సమస్యకు చెక్ పెడతానని గతంలో పేర్కొన్నారు. కానీ కొన్ని జిల్లాల పర్యటనలతోనే సీఎం షెడ్యూల్ ముగియడంతో తాము మంత్రుల వెంట పడాల్సి వస్తోందని శాసన సభ్యులు వివరిస్తున్నారు.
Also read: Bonalu Festival: భాగ్యనగరంలో మొదలైన బోనాల సందడి.. పూర్తి షెడ్యుల్ ఇదే..!
నిజానికి నియోజకవర్గాల్లో శాసన సభ్యులు మరింత పట్టు నిలుపుకోవాలంటే రోడ్లు,ఆసుపత్రి భవనాల వంటి అత్యవసర పనులకు నిధులు కేటాయించాలి..పెండింగ్ లోని వర్స్స్ క్లియర్ చేయించాలి. కానీ కొంత మంది మంత్రుల వద్ద ప్రాసెస్ డీలే అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేయాల్సి వస్తోన్నది. గతంలో ఒక జిల్లా పర్యటనలో.. “నిధులు లేవని ఎన్నిసార్లు చెప్తారు?”అంటూ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక మంత్రిని సున్నితంగానే నిలదీసినట్లు సమాచారం.దానికి సదరు మంత్రి కూడా.. “ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంటే నేనేం చేయాలి?” అని ఆఫ్ ది రికార్డ్‌గా చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే త్వరలో రాబోయే ఎన్నికల్లో పార్టీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా ఎమ్మెల్యేల నుంచి వస్తున్నాయి.
మరోవైపు గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, మండలంలోనూ ఆ పార్టీ నాయకుల పేర్లతో కూడిన ప్రారంభోత్సవ శిలాఫలకాలు, అభివృద్ధి ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి ప్రభావాన్ని తగ్గించి, కాంగ్రెస్ మార్క్ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ హయాంలో కొత్త రోడ్లు, ఆసుపత్రులు నిర్మించి, కొత్త శిలాఫలకాలు వేయాలనేది ఎమ్మెల్యేల ప్రధాన వ్యూహం. దీనికోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి అధికారులకు ఇస్తున్నా.. మంత్రుల నుంచి ఆశించిన సపోర్ట్ లభించడం లేదనే అసంతృప్తి నెలకొంది.
ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ లోపం కంటే నిధుల కొరతే ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్‌ను కాపాడుకోవాలన్నా తక్షణమే నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నదనే టాక్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నది. లేనిపక్షంలో సొంత పార్టీ నేతల మధ్యే విబేధాలు ముదిరి, అది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రమాదం పొంచి ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో తమ మార్క్ కనిపించేలా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కొందరు ఎమ్మెల్యేలు మొర పెట్టుకుంటున్నారు. రాబోయే ఎడాది లోపు తన నియోజకవర్గాల్లో పెండింగ్ వర్క్స్ ను క్లియర్ చేయగలిగితే తాము సునాయసంగా మళ్లీ గెలిచే ఛాన్స్ ఉంటుందని కొందరు ఎమ్మెల్యేలు నేరుగానే మంత్రులకు చెప్పేస్తున్నారట. ఇదే అంశంపై పార్టీలోనూ తాజాగా చర్చ జరిగినట్లు తెలిసింది.
Also Read: Illegal Gate: మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌పై.. ల్యాండ్ మాఫియా దాడి కలకలం