Bluetooth Gadgets: వయసు పైబడే కొద్దీ చిన్న చిన్న పనులు కూడా కాస్త భారంగా అనిపించడం సహజం. మతిమరుపు వల్ల వస్తువులు ఎక్కడో పెట్టి వెతకడం, టీవీ సౌండ్ సరిగ్గా వినబడకపోవడం, ఫోన్ కాల్స్ మాట్లాడటానికి ఇబ్బంది పడటం వంటివి వృద్ధులు నిత్యం ఎదుర్కొనే సమస్యలే. అయితే ప్రస్తుత సాంకేతికత కేవలం యువతకే కాకుండా పెద్దవారికి సైతం అండగా నిలుస్తోంది. నేటి స్మార్ట్ యుగంలో వృద్ధుల దైనందిన జీవితాన్ని మరింత సులభతరం, సురక్షితం చేసేందుకు కొన్ని అద్భుతమైన బ్లూటూత్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైన 5 పరికరాలేంటో ఈ కథనంలో చూద్దాం.
వృద్ధులలో సాధారణంగా కనిపించే సమస్య మతిమరుపు. కళ్ళజోడు, ఇంటి తాళాలు, పర్స్, టీవీ రిమోట్ ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారు. ఇలాంటి సమయంలో ‘బ్లూటూత్ ట్రాకర్స్’ స్నేహితుడిలా సహాయపడతాయి. ఈ చిన్న బిళ్ళలాంటి పరికరాన్ని కీచైన్‌కో లేదా వాలెట్‌కో తగిలిస్తే చాలు. వస్తువు కనపడనప్పుడు ఫోన్‌లోని యాప్ ద్వారా బటన్ నొక్కితే ఆ పరికరం పెద్దగా శబ్దం చేస్తుంది. దీంతో నిమిషాల్లో వస్తువు ఎక్కడుందో కనిపెట్టవచ్చు.
ఇప్పుడు వస్తున్న సరికొత్త బ్లూటూత్ వినికిడి పరికరాలు నేరుగా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతాయి. వీటి ద్వారా వృద్ధులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు. అలాగే టీవీ లేదా రేడియో సౌండ్‌ను నేరుగా తమ చెవుల్లోకే స్పష్టంగా వినవచ్చు. చుట్టుపక్కల ఉండే అనవసరపు శబ్దాలను తగ్గించి, కావలసిన ధ్వనిని మాత్రమే ఇవి అందిస్తాయి.
అలెక్సా, గూగుల్ హోమ్ వంటి స్మార్ట్ బ్లూటూత్ స్పీకర్లు వృద్ధులకు మంచి తోడుగా నిలుస్తాయి. చేతులతో బటన్లు నొక్కే పని లేకుండా కేవలం నోటి మాటతోనే వీటిని కంట్రోల్ చేయవచ్చు. ‘అలెక్సా.. భక్తి పాటలు పెట్టు’, ‘హాస్పిటల్ అపాయింట్‌మెంట్ గుర్తు చేయి’, ‘ఈరోజు వాతావరణం ఎలా ఉంది?’ అని అడిగితే ఇవి వెంటనే స్పందిస్తాయి. సమయానికి మందులు వేసుకోవాలని అలారమ్ సెట్ చేసుకోవడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం వృద్ధులకు చాలా అవసరం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్లూటూత్ ద్వారా పనిచేసే బీపీ, షుగర్ మానిటరింగ్ పరికరాలు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి. ఈ పరికరాలు తీసుకున్న రీడింగ్స్‌ను బ్లూటూత్ ద్వారా నేరుగా స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌కు పంపుతాయి. దీనివల్ల డాక్టర్‌కు ఆ రిపోర్టులను సులభంగా వాట్సాప్ ద్వారా పంపవచ్చు.
Also Read: స్మార్ట్‌ఫోన్లలో ‘రిమూవబుల్ బ్యాటరీలు’ ఎందుకు మాయమయ్యాయి? అసలు రహస్యం ఇదే!
రాత్రి పూట బెడ్ పై నుంచి లేచి స్విచ్ బోర్డు వరకు వెళ్లడం వృద్ధులకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి బ్లూటూత్ స్మార్ట్ ప్లగ్స్ సాయంతో గదిలోని లైట్లు, ఫ్యాన్లు, గీజర్, టీవీని ఉన్న చోటు నుంచే ఫోన్ ద్వారా ఆఫ్ చేయవచ్చు. లేదంటే వాయిస్ కమాండ్ ద్వారా కూడా వాటిని నియంత్రించవచ్చు. ఇది పెద్దలకు శారీరక శ్రమను తగ్గించడమే కాకుండా కాలు జారి పడే ప్రమాదాలను నియంత్రిస్తుంది.
Also Read: పవర్‌ఫుల్ బ్యాటరీ, మతిపోయే AI ఫీచర్లు.. రూ.30 వేలలో మోస్ట్ వాంటెడ్ ఫోన్స్!