
Congress Party News(TS Political Updates) : తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ సమరభేరి మోగిస్తోంది. బుధవారం సాయంత్రం ఆదిలాబాద్‌లో నిరుద్యోగ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగ సమరభేరి సభను విజయవంతం చేసేందుకు డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరిగాయి.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమం జరిగిందే.. నీళ్లు-నిధులు-నియామకాలు కోసం.. అయితే.. సొంత రాష్ట్రం ఏర్పడి 9ఏళ్లు గడిచినా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
TSPSC ప్రశ్నాపత్రాలు లీక్ చేసి అమ్ముకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. అంబేద్కర్ చౌక్‌లో జరిగే సభకు రేవంత్‌రెడ్డి హాజరవుతారు. ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో.. ఆదిలాబాద్‌లో ఆ పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో ఉన్నాయి.
రేవంత్‌రెడ్డి సాయంత్రం 4 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. మావల వద్ద ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి నిరుద్యోగుల నిరసన ర్యాలీ మొదలవుతుంది. ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, సినిమా రోడ్ మీదుగా అంబేద్కర్ చౌక్ చేరుకుంటుంది. అక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు.