Medigadda Barrage news today(Latest news in telangana): మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కోర్టు నోటీసులు వచ్చాయి. వచ్చే నెల 5వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవ్వాలని భూపాలపల్లి కోర్టు ఆదేశించింది. కేసీఆర్, హరీశ్ రావు సహా మరో ఆరుగురికి నోటీసులు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం విషయంలో విచారణ చేయాలని ఓ పిటిషన్ కోర్టులో దాఖలైంది. భారీగా ప్రజా ధనం వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, కానీ, ఆ ప్రాజెక్టు అంతలోనే పనికి రాకుండా పోయిందని పిటిషనర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం చెందడానికి ప్రధాన కారకుడు మాజీ సీఎం కేసీఆరేనని ఆరోపించారు.
గతేడాది నవంబర్ 7వ తేదీన భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆరోపించారు. కాబట్టి, ఆయనపై కేసులు పెట్టి విచారిస్తే నిజానిజాలు బయటపడతాయని పేర్కొన్నారు. తాను గతంలోనే డీజీపీ, జిల్లా ఎస్పీ, భూపాలపల్లి ఎస్‌హెచ్ఓలకు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్ల వల్ల తన ఫిర్యాదును స్వీకరించలేదని రాజలింగమూర్తి పేర్కొన్నారు.
Also Read: యూపీకి షేక్ హసీనా.. ఇక్కడి నుంచి లండన్‌కు!
పిటిషనర్ పేర్కొన్న నిందితుల జాబితాలో మాజీ మంత్రి కేసీఆర్, నాటి మంత్రి హరీశ్ రావు సహా పలువురు అధికారులు ఉన్నట్టు తెలుస్తున్నది. వీరంతా ముందంతా కలిసి కూడబలుక్కునే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచారని, అంతులేని దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్‌డీఎస్ఏ కోరిన పలు కీలక వివరాలను ఉద్దేశపూర్వకంగానే సమర్పించలేదని, కావాలనే కొన్ని లోపాలను దాచిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు.
బ్యారేజీ నిర్మాణానికి ముందు సాయిల్ టెస్ట్ చేయలేదని, ఇసుక కింద బొగ్గు పొరలు ఉన్నాయనీ పిటిషనర్ వివరించారు. ఇది తెలిసినా హడావుడిగా ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారని ఆరోపించారు. నిర్మాణ సంస్థలపైనా కేసీఆర్, హరీశ్ రావులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని, నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ కూడా నాసిరకం వాడారని, కనీస ప్రమాణాలు పాటించలేదని తన ఫిర్యాదులో రాజలింగమూర్తి వివరించారు.