Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో గత నెల మొదలైన ఆందోళనలు కొన్ని రోజుల క్రితం హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు సాయుధులై అల్లకల్లోలం సృష్టించారు. అధికార పార్టీ కార్యకర్తలపై దాడులు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. పలు చోట్లు బుల్లెట్లు కూడా పేల్చారు. ఈ హింసాత్మక ఆందోళనల్లో 300 మందికి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్‌ను మొదటి నుంచీ వారు బలంగా వినిపించారు. ఆందోళనకారుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలత ప్రకటించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేరు. ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చుతుండటంతో షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేశారు.
ఆందోళనకారులు ప్రధాని నివాసాన్ని చేరుకోవడానికి ముందే ఆమె తన సోదరితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సైనికులు ఆమెను సమీప విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో తరలించారు. ఈ రోజు ఉదయం నుంచి ఆమె భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఆమెను సురక్షితంగా చూసుకోవడానికి అంగీకరించిన తర్వాతే ఆమె మన దేశంలో అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్‌లోని హిండస్ ఎయిర్‌బేస్‌కు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా హెలికాప్టర్‌లో చేరుకున్నారు. ఆమెకు ఐఏఎఫ్ అధికారులు స్వాగతం పలికినట్టు తెలిసింది. ఇక్కడి నుంచి ఆమె లండన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన లేకున్నా.. విశ్వసనీయ వర్గాలు మాత్రం ఆమె లండన్ వెళ్లిపోతారని చెప్పాయి.
Also Read: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ఎందుకంటే ?
ఇక బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘటనలు రెండేళ్ల క్రితం శ్రీలంకలో చోటుచేసుకున్నవాటిని గుర్తుకు తెస్తున్నాయి. ఈ రోజు ప్రధానమంత్రి నివాసాన్ని అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. ఆవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టి నాశనం చేశాయి. హోం మంత్రి ఇంటికి నిప్పు పెట్టాయి.
షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వం కూలినట్టయింది. వెంటనే ఆర్మీ బాధ్యతలు తీసుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో సైనిక పాలన మొదలైంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ సాయంత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు రాత్రికల్లా తాము హింసను అదుపులోకి తెస్తామని వివరించారు. అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే ఆర్మీ పాలన విధించినట్టు చెప్పారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని స్పష్టం చేశారు.