ప్రజా జీవితంలో ఉన్న మహిళలపై వ్యక్తిగత దాడులు చేయడం, వారి చరిత్రను హననం చేయడం ఏమాత్రం సహించబోమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో మహిళా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల్లో ఉన్న మహిళలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసభ్యకర ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘మహిళలపై విమర్శ చేయడం వేరు, దుష్ప్రచారం చేయడం వేరు’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని.. కానీ ఆ విమర్శలు మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉండకూడదని సీపీ అభిప్రాయపడ్డారు. టీవీ చర్చలు, సోషల్ మీడియా పోస్టులు, వార్తా కథనాల పేరుతో కొందరు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇది విమర్శ కాదు, ఒక రకమైన క్రూరత్వం అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా.. గృహిణి అయినా మహిళ గౌరవం అపరిమితమని.. దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు.
నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారని సజ్జనార్ కొనియాడారు. ‘పాలన, పోలీస్ శాఖ, సైన్స్, మీడియా ప్రజాజీవితంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు ఇల్లు, ఇటు ఉద్యోగం రెండింటినీ సమతుల్యం చేస్తూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అటువంటి వారిపై దాడులు చేయడం అంటే దేశ ప్రగతిపై దాడి చేయడమే’ అని ఆయన వ్యాఖ్యానించారు. కనిపించని బాధ్యతలతో కుటుంబాన్ని నడుపుతున్న మహిళా శక్తిని తక్కువ అంచనా వేయకూడదని సూచించారు.
భారతీయ సంస్కృతిలో మహిళకు ఇచ్చే ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ.. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ (ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు) అనే శ్లోకాన్ని ఆయన ప్రస్తావించారు. మహిళలను గౌరవించని సమాజం తన భవిష్యత్తును కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం చేయడం వల్ల వారి మనోధైర్యం దెబ్బతింటుందని, ఇది దేశానికి నష్టమని హెచ్చరించారు.
మహిళలపై అవమానం, వివక్ష, క్యారెక్టర్ అస్సాసినేషన్ చేసే వారిని ఇకపై సహించే ప్రసక్తే లేదని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ‘ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్’ (భవిష్యత్తు మహిళలదే) అని పేర్కొంటూ.. ఆ భవిష్యత్తు గౌరవప్రదమైన వాతావరణంలోనే నిర్మితం కావాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు.
ALSO READ: Medaram Jathara: మేడారంలో మొదలైన జాతర సందడి.. పోటెత్తిన భక్త జనసంద్రోహం