MP Chamala Kiran Kumar Reddy: మాజీ మంత్రి హరీశ్ రావు పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు.
‘మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ నేతలపై చెంప చెల్లు మంటుందని మాట్లాడుతున్నారు. ఎవరి గూబ గుయ్ మంటుందో నవంబర్ 11న తెలుస్తుంది. మా మామ హైదరాబాద్ లో లక్ష ఇండ్లు కట్టించారు, రేవంత్ రెడ్డి లక్ష కూల్చిండు అంటూ తప్పుడు ప్రచారం చేస్తు్న్నారు. కేసీఆర్ హైదరాబాద్ ను న్యూయార్క్ చేస్తానని మాయమాటలు చెప్పారు. కేసీఆర్ లక్ష ఇండ్లు ఎక్కడ కట్టిండో తెల్వదు కానీ, ప్రభుత్వ అధికారులను తన చేతిలో పెట్టుకుని ఇష్టానుసారం నాలాల మీద, చెరువుల మీద భవనాలకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ముంచారు’ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ను ప్రపంచంలో గొప్ప నగరంగా చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ఇవాళ మునిగిపోయే నగరంగా చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం తేరుకుంటుంది. చిన్న వర్షానికి మునిగిపోయే పరిస్థితి నుంచి గట్టెక్కుతుంది. చెరువులు, నాలాల మీద బిల్డింగ్ లు కట్టిన వాళ్లకు ప్రభుత్వం వార్నింగ్ లు ఇస్తుంది. మరీ దారుణంగా ఆక్రమించి నిర్మించిన భవనాలను కూలగొడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో రివర్ ఫ్రంట్, ఎఫ్టీఎల్ పరిధిలో బిల్డింగ్ లు కొనడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన హైడ్రా.
ఇవాళ ఎన్నికలు వచ్చాయని హరీశ్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. హరీశ్ రావు ఒకప్పుడు ట్రబుల్ షూటర్ అనేవాళ్లు ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హుజూరాబాద్ లో ఇంటింటికీ కవర్లలో డబ్బులు పంచే కార్యక్రమం చేసేవాళ్లు. జూబ్లీహిల్స్ లో కూడా బీఆర్ఎస్ అదే పని చేద్దామనుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంతో.. బీఆర్ఎస్ కు షాక్ కొట్టింది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నివేదికలు అందుతుండడంతో.. కేటీఆర్, హరీశ్ రావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎవరు గూండాలు, ఎవరు డబ్బులతో గెలవాలనుకుంటున్నారో 11వ తేదీన తేటతెల్లం అవుతుంది’ అని ఎంపీ చామల కిరణ్ అన్నారు.
‘బీఆర్ఎస్ సెంటిమెంట్ మీద ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అభివృద్ధి చూసి ఓటర్లు ఓట్లు వేస్తారు. బీఆర్ఎస్ ఇప్పటికే ఘోరంగా ఓడిపోయింది. కంటోన్మెంట్ లో డిపాజిట్ పోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. జూబ్లీహిల్స్ ఫలితాలతో కార్యకర్తలు ఎవరూ బీఆర్ఎస్ జెండాలు ఎత్తే పరిస్థితులు ఉండదు. ఆ పరిస్థితి వస్తుందేమోనన్న భయంతో కేటీఆర్, హరీశ్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నవంబర్ 11న ఎవరి చెంప చెల్లు మంటుందో, ఎవరి గూబ గుయ్ మంటుందో తెలుస్తుంది’- ఎంపీ చామల కిరణ్
Also Read: Jubilee Hills Bypoll Elections: జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు.. రేవంత్ ప్రచార భేరీ..!