Deputy CM Bhatti Vikramarka: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయా? ఎన్టీవీ రాసిన కథనాల వ్యవహారం కొత్త మలుపు తిరిగిందా? ఈ వ్యవహారం కాస్త బొగ్గు గనులకు లింక్ అయ్యిందా? ఓ ఛానెల్ కథనంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. నైనీ బొగ్గు వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం ఇలాంటి దిగజారుడు పనులు చేసేంత బలహీనమైన వ్యక్తిని తాను కాదన్నారు.
ఛానెల్ కథనంపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం
ఎన్టీవీ కథనాల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీని వెనుక ఒడిషాలోని నైనీ బొగ్గు గనుల అంశం ఉండొచ్చంటూ ఓ ఛానెల్ ప్రత్యేకంగా ఓ కథనాన్ని రాసుకొచ్చింది. చివరకు ఈ వ్యవహారంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి సంస్థకు ఒడిషాలో నైనీ బొగ్గు గనులు ఉన్నాయన్నారు. వీటి టెండర్లను దక్కించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారవేత్తలు పోటీ పడుతున్నారు. తొలుత సైట్ విజిట్ చేసే పనిలో పడ్డారు. ఆ తర్వాత టెండర్లు దాఖలు చేయనున్నారు ఆయా కంపెనీలు.
ఈ టెండర్ల వ్యవహారం వెనుక డిప్యూటీ సీఎం ప్రమేయముందని కథనం రాయడంపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఆ టెండర్‌లో ఎలాంటి నియమాలు ఉండాలో బోర్డు నిర్ణయిస్తుందన్నారు. అంతేకానీ మంత్రి కాదన్నారు. ఈ మాత్రం జ్ఞానం లేకుండా కట్టు కథలు అల్లారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడాని కోసం తనపై కథనాలు రాశారని మండిపడ్డారు. సైట్ విజిట్ అనేది దాన్ని పరిశీలించిన తర్వాత అందుకు తగ్గట్టుగా వ్యాపారవేత్తలు టెండర్ దాఖలు చేస్తారన్నారు. అందుకోసం సైట్ విజిట్ అవకాశం కల్పిస్తారన్నారు డిప్యూటీ సీఎం.
నైనీ బొగ్గు గనుల వ్యవహారం ఏంటి?
మిగతా విషయాలు ఆ ఛానెల్ ఎండీ-తాను తేల్చుకుంటామన్నారు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి, బోర్డు దాన్ని క్యాన్సిల్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఆ శాఖ మంత్రిగా వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చే బాధ్యత తనపై ఉందన్నారు. మళ్లీ కొత్తగా టెండర్లు ఆహ్వానించాలని చెప్పినట్టు తెలిపారు. టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చామని, ఇంకా ఎవరూ పార్టిసిపేట్ చేయలేదని అధికారులు అన్న విషయాన్ని గుర్తు చేశారు.
మాజీ సీఎం వైఎస్ఆర్‌తో అత్యంత సాన్నిహిత్యం ఉండడం వల్ల ఆయన మీద కోపం తన మీద చూపించడానికి రాసి ఉండవచ్చని అన్నారు భట్టి విక్రమార్క. ఆయన ఏ ఉద్దేశంతో ఈ కథనం రాశారు? ఎందుకు రాశారు? దీని వెనుక ఏ రాజకీయ ఉద్దేశం ఉంది? దానివెనుక ఎవరుండి నడిపిస్తున్నారు? అన్ని విషయాలు తిరిగి మీడియాకు వివరిస్తామని తెలిపారు. తాను ఈ బాధ్యతలో ఉన్నంతకాలం ఏ గద్దలను వాలనివ్వనని అన్నారు.
ALSO READ: రేపో మాపో నోటిఫికేషన్.. కత్తులు దూస్తున్న పార్టీలు
రాష్ట్ర ఆస్తులను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించడమే తన లక్ష్యమన్నారు. ఆస్తులు సృషించుకోవడం కోసం, వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకోవడం కోసం, అధికారం అనుభవించడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. తనకంటూ ఓ ప్రత్యేక లక్ష్యం మేరకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఆస్తులను, వనరులను, వ్యవస్థలను సమాజంలోని అన్నివర్గాలకు పంచడమే తన ఉద్దేశ్యమన్నారు. అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు.
టెండర్లు పిలిచింది సింగరేణి సంస్థ.. ఆ టెండర్‌లో ఎలాంటి నియమాలు ఉండాలో బోర్డు నిర్ణయిస్తుంది.. మంత్రి కాదు.. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా కట్టుకథలు అల్లి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడాని కోసం నాపై కథనాలు రాశారు
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క pic.twitter.com/vAu4ncVEA8
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2026