Big Stories

Digvijay: దిగ్గీ టాక్స్.. ఫుల్ టాక్ టైమ్.. ఓవర్ టు గాంధీభవన్

Digvijay: దిగ్గీరాజా వచ్చేశారు. వచ్చీరాగానే పని మొదలు పెట్టేశారు. బుధవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకోగా.. ఆ వెంటనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక, గురువారం ఉదయాన్నే హోటల్ లో జగ్గారెడ్డితో మంతనాలు జరిపారు. పార్టీ పరిణామాలన్నిటినీ వివరించానని.. దిగ్విజయ్ కు తెలంగాణ కాంగ్రెస్ పై మంచి అవగాహన ఉందని జగ్గారెడ్డి అన్నారు. ఇక, గాంధీభవన్ వేదికగానే భేటీలు ఉంటాయని దిగ్విజయ్ చెప్పారు.

- Advertisement -

గాంధీభవన్ లో ఒక్కో నేతకు 15 నిమిషాల చొప్పున టైమ్ కేటాయించారు దిగ్విజయ్ సింగ్. మధ్యాహ్నం వరకు వరుస భేటీలు ఉండనున్నాయి. తిరుగుబాటు సీనియర్లతో పాటు ఇప్పటికే రాజీనామా చేసిన 12 మంది టీడీపీ వలస నేతలు సైతం దిగ్గిరాజాతో మాట్లాడనున్నారు. అందరి అభిప్రాయాలు విని.. తుది నివేదిక అధిష్టానానికి అందించనున్నారు.

- Advertisement -

అయితే, సాయంత్రం దిగ్విజయ్ మీడియాతో మాట్లాడతారని, రాత్రికి ఢిల్లీ వెళ్లిపోతారని చెప్పినా.. పరిస్థితి తీవ్రత వల్ల దిగ్విజయ్ షెడ్యూల్ మారింది. మరోరోజుకు పొడిగించబడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడి.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు దిగ్విజయ్.

ఇక, బుధవారమే ఢిల్లీలో దిగ్విజయ్ తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డిలు వేరువేరుగా చర్చలు జరిపారు. కమిటీ కూర్పు, పార్టీ నేతల తీరుపై రేవంత్ వివరించినట్టు తెలుస్తోంది. అటు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిపై అనేక ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. కొత్త కమిటీల్లో రేవంత్ వర్గానికి, వలస నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం.. సునీల్ కనుగోలు, మాణిక్యం ఠాగూర్ సైతం రేవంత్ కు అనుకూలంగా పని చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక.. హుజురాబాద్, మునుగోడులో పార్టీ వైఫల్యంపై దిగ్విజయ్ కు వివరించినట్టు తెలుస్తోంది.

ఇక గాంధీభవన్ లో జరిగే చర్చల్లో రాష్ట్ర పరిస్థితులపై ఓ అవగాహనకు రానున్నారు దిగ్విజయ్ సింగ్. రేవంత్ వర్గం కూడా బలమైన వాదనలు వినిపించేందుకు రెడీ అవుతున్నారు. తాము పార్టీలో చేరి చాలా ఏళ్లు అవుతోందని.. ఇంకా తమను కొత్త వాళ్లు, వలస నేతలు అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నాగం జనార్థన్ లాంటి నేత అయితే, తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని.. తనను కూడా వలస కోటాలో కలిపేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఇలా ఎవరికి వారే తమ వర్షన్ ను అధిష్టానం దూత ముందు గట్టిగా వినిపించనుండటంతో.. టి.కాంగ్ కల్లోలాన్ని దిగ్విజయ్ సింగ్ ఎలా పరిస్కరిస్తారోననే ఆసక్తి నెలకొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News