DK Aruna: స్వేచ్ఛ బ్యూరో: జూరాల ప్రాజెక్టు పరిధిలోని గద్వాల, ఆత్మకూరులో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నీటిని విడుదల చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఎంపీ డీకే అరుణ శనివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి, క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన పరిస్థితులను వివరించారు.
డీకే అరుణ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. జూరాల ఆయకట్టు కింద సాగు చేసిన పంటలకు నీరు అందక ఎండిపోతుండటంతో గద్వాల, ఆత్మకూరు ప్రాంతాల్లోని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని గుర్తు చేశారు. రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే మూడు రోజులలోగా జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు.
ఎండిపోయాక నీళ్లిస్తే బూడిదలో పోసిన పన్నీరే..
రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత భవిష్యత్తులో అధికారులు నీటిని విడుదల చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని, అది కేవలం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని స్పష్టం చేశారు. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే అన్నదాతలు కన్నీరు పెడుతున్నారని, ప్రభుత్వం స్పందించి జూరాల దిగువన సాగుభూములకు వెంటనే నీటిని విడుదల చేయాలని అన్నారు.
మంత్రి ఉత్తమ్‌కు డీకే అరుణ విజ్ఞప్తి..
మానవీయ కోణంలో ఆలోచించి రైతాంగం ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఎండిపోతున్న పంటలకు తక్షణమే నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రిని కోరారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి పై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి, అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read: లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం