Konda Surekha: నిన్న రాత్రి జూబ్లీహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. మంత్రి ఇంటికి వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో వచ్చారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులతో కొండా సురేఖ కూతురు సుస్మిత వాగ్వాదానికి దిగారు. సుమంత్‌కు అరెస్ట్‌కు పోలీసులు సరైన కారణాలు చెప్పడం లేదని ఫైర్ అయ్యారు.
పోలీసులతో కొండా సురేఖ కుమార్తె సస్మిత వాగ్వాదం..
తమ ఇంటికి ఎందుకు వచ్చారని, లేకపోతే మా అమ్మను అరెస్ట్ చేసేందుకు వచ్చారా? అని పోలీసులను ప్రశ్నించారు. కేసు వివరాలు చెప్పకుండా సుమంత్‌ను అప్పగించడం కుదరదని చెప్పేశారు. చాలా సమయం పోలీసులు అక్కడ ఉండి తర్వాత వెళ్లిపోయారు.
మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు కుట్ర-సుస్మిత..
ఇదే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంగా మమ్మల్ని అణచాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు చేశారు. బీసీ మంత్రి ఉండొద్దనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీసీలను అణగదొక్కాలని చూస్తున్నట్లు మండిపడ్డారు. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నట్లు తెలిపారు. సుమంత్‌పై అభియోగాలు పెట్టి మా నాన్నను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని సుస్మిత ఆరోపించారు. సుమంత్‌పై మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు ఇచ్చారని తెలిసిందన్నారు. డెక్కన్ సిమెంట్ వాళ్లను సుమంత్ గన్‌తో బెదిరించారని ఫిర్యాదు ఇచ్చారని, మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతో అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు తెలిపినట్లు సుస్మిత తెలిపారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో వేం నరేందర్ రెడ్డి..
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ, ప్రభుత్వ పెద్దలు స్పీచులు దంచుతున్నారని, కానీ మా అమ్మపై.. బీసీ బిడ్డ అని కూడా చూడకుండా అందరూ కుట్రలు చేస్తున్నారని కామెంట్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వేం నరేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇన్వాల్‌మెంట్ ఉందని సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉండగానే.. మంత్రి కొండా సురేఖ మాత్రం తన కారులో సుమంత్‌ను వెంట పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లారు. అయితే పొన్నం లేకపోవడంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది.
నిన్న సుమంత్‌ను విధుల నుంచి తప్పించిన సర్కార్
కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది. నిన్న సుమంత్‌ను తన బాధ్యతల నుండి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అవినీతిలో సుమంత్ పాత్ర ఏమైనా ఉందా?
అసలు సుమంత్‌ని విధుల నుంచి ఎందుకు తప్పించారు? అతడిని ఎందుకు అరెస్ట్ చేయాలనుకున్నారు? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ శాఖలో అవినీతి ఏమైనా జరిగిందా? అవినీతి కార్యకలాపాల్లో ఓఎస్డీ సుమంత్ పాత్ర ఏమైనా ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది. అందుకోసమే సుమంత్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించాలని అనుకున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.