Sridhar Babu: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో జరిగే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు.
AusBiotech International Conference 2025 పేరుతో ఈ సదస్సు.. అక్టోబర్ 21 నుండి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో జరగనుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల్లో ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ సమావేశం. ఈ సదస్సులో పాల్గొనాలని, అలాగే ప్రధాన ఉపన్యాసం ఇవ్వాలని ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ అధికారిక ఆహ్వానం పంపారు.
ఈ గౌరవం భారతదేశంలో ఏకైక మంత్రి అయిన శ్రీధర్ బాబుకు దక్కడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 50కుపైగా దేశాల నుంచి ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమాధిపతులు, పాలసీ మేకర్లు పాల్గొననున్నారు.
ఇటీవలి రెండు సంవత్సరాల్లో తెలంగాణ లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్ రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించింది. హైదరాబాదులోని జీనోమ్ వ్యాలీ ప్రపంచంలోనే.. అగ్రగామి బయోటెక్ క్లస్టర్‌లలో ఒకటిగా నిలుస్తోంది.
మంత్రి శ్రీధర్ బాబు గత రెండు సంవత్సరాలుగా లైఫ్ సైన్సెస్ రంగంలో సహకార వాతావరణం, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్, పరిశోధన ఆధారిత ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించారు. టెలంగానా లైఫ్ సైన్సెస్ సమిట్, హెల్త్ టెక్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించారు.
ముఖ్యంగా AusBiotech కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్ బాబు Emerging Opportunities in Life Sciences and Biotechnology The Telangana Model అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేయనున్నారు. ఆయన తన ప్రసంగంలో తెలంగాణలో లభించే మౌలిక వసతులు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, స్టార్ట్‌అప్ ప్రోత్సాహకాలు, పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలపై వివరించనున్నారు.
ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ బుధవారం.. మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో గ్లోబల్ ఫార్మా, బయో టెక్నాలజీ, మెడ్‌టెక్” ఆవిష్కరణ హబ్ గా.. తెలంగాణ ను తీర్చి దిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఆస్ట్రేలియా – తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
ఈ ఆహ్వానం లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఏడు అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం మనదే. ఈ రంగంలో కొత్తగా రూ.63వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. మరిన్ని తీసుకొచ్చేందుకు ఈ వేదికను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం. ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది” అని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.