Hyderabad: మిస్టర్ టీ అండ్ మిస్టర్ ఇరానీ టీ బ్రాండ్ యజమాని కే. నవీన్ రెడ్డిపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నగర బహిష్కరణ విధించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ప్రజలను భయాందోళనకు గురిచేయడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నగర బహిష్కరణ ఆరు నెలల పాటు అమల్లో ఉండనున్నట్టు సుధీర్ బాబు తెలిపారు.
వివరాల ప్రకారం.. గతంలో చేసిన అనుచిత కార్యకలాపాల వల్ల నవీన్ రెడ్డి వ్యవహార శైలిని చూసి స్థానికులు తీవ్ర కలవరం చెందుతున్నారు. అతనిపై ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఐదు కేసులు నమోదై ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ కేసులలో ఉన్న సాక్షులను సైతం బెదిరింపులకు గురిచేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. నవీన్ రెడ్డి బెదిరింపులు, వేధింపులు, చట్ట వ్యతిరేక చర్యల పట్ల ఆదిబట్ల ఇన్‌స్పెక్టర్, ఇబ్రహీంపట్నం ఏసీపీలు ఒక సమగ్ర నివేదికను తయారుచేసి రాచకొండ సీపీ సుధీర్ బాబు ముందుకు పంపారు. ఆ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నవీన్ రెడ్డికి నోటీసు జారీ చేసి, బుధవారం రోజు నగర బహిష్కరణ అమలు చేస్తున్నట్లు సీపీ ప్రకటించారు.
నవీన్ రెడ్డి 2022 డిసెంబర్‌లో తుర్కయంజాల్‌లోని ఓ వైద్య విద్యార్థిని కిడ్నాప్ ఘటనతో సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. అప్పట్లో ఆ యువతికి ఎంగేజ్‌మెంట్ ఏర్పాట్లు జరుగుతుండగా.. నవీన్ రెడ్డి దాదాపు 40 మంది అనుచరులతో పగటి సమయంలోనే ఆమె ఇంటిపై దాడి చేశాడు. ఆమె ఇంట్లోని ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేసి, ఆమె తండ్రి దామోదర్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు దాడి చేసి ఆ యువతిని కిడ్నాప్ చేశాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. నవీన్ రెడ్డికి, యువతికి గతంలో బ్యాడ్మింటన్ అకాడమీలో పరిచయం ఏర్పడింది. అయితే, నవీన్ రెడ్డితో స్నేహం చేయొద్దని యువతిని తల్లిదండ్రులు మందలించారు. దీంతో కోపంతో రగిలిపోయిన నవీన్ రెడ్డి, ఆమెపై నిఘా ఉంచడానికి ఆమె ఇంటికి ఎదురుగా తన ‘మిస్టర్ టీ’ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. తన ఎంగేజ్‌మెంట్ గురించి తెలుసుకుని, అతను ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఈ కిడ్నాప్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కిడ్నాప్‌కు కారణమైన ‘మిస్టర్ టీ’ అవుట్‌లెట్‌ను కూడా కూల్చివేశారు. అదే రోజు రాత్రి పోలీసులు నవీన్‌ను, యువతిని గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసులు యువతిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇక అప్పటి నుంచి ఆ విద్యార్థినితో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా తరచుగా బెదిరిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా తీవ్ర నేరచరిత్ర ఉన్న నవీన్ రెడ్డిపై ఇప్పటికే పోలీసులు పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్‌ను కూడా విధించిన విషయం తెలిసిందే. ప్రజలకు భద్రత కల్పించడం, శాంతి భద్రతలను కాపాడటంలో భాగంగా నవీన్ రెడ్డిపై నగర బహిష్కరణ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.