ED Raids : 3 నెలల క్రితం చీకోటి ప్రమీణ్ క్యాసినో వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు ఈడీ అధికారులు ఈ కేసుపై మళ్లీ ఫోకస్ పెట్టారు. తలసాని సోదరులు ధర్మేంద్ర యాదవ్, మహేశ్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. క్యాసినో నిర్వహించిన చీకోటి ప్రవీణ్, ఆయన అనుచరుడు శ్రీనివాస్‌రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు 3 నెలల క్రితం సోదాలు చేశారు. 8 బృందాలతో సోదాలు జరిపారు. అప్పుడు కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించిన తర్వాత మరోసారి దర్యాప్తును ప్రారంభించారు.
తలసాని మహేశ్, తలసాని ధర్మేంద్రయాదవ్ చీకోటి ప్రవీణ్‌తోపాటు క్యాసినో కోసం విదేశాలకు వెళ్లారని ఈడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో నిందితులు హవాలాకు పాల్పడ్డారని ప్రాథమికంగా తేల్చారు. విదేశాలకు నగదు తీసుకెళ్లే క్రమంలో ఆర్‌బీఐ నిబంధనలు పాటించారా? లేదా? అనే దానిపై వారిని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. వారి నుంచి మనీ లాండరింగ్, క్యాసినో కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
క్యాసినో వ్యవహారంలో మరో రెండ్రోజుల్లో రాయలసీమకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తారని సమాచారం. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు త్వరలో వారిని విచారించే అవకాశముందని సమాచారం.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. గురువారం విచారణకు రావాలని కోరింది. తెలంగాణకు చెందిన ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలతో చీకోటి ప్రవీణ్ వాట్సాప్ లో చాటింగ్ చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ చాట్ ఆధారంగా ఆ నాయకులతో ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అవసరమైతే ఆ ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.