Gift Deed: టమోసపూరితంగా తన ఇంటిని గిఫ్ట్‌డీడ్ చేయించుకున్నారని, దాన్ని రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం గ్రామానికి చెందిన వృద్ధురాలు మంగలి పెంటమ్మ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. తన పేరుపై ఉన్న 106 గజాల ఇంటిని పెద్ద కోడలు గిఫ్ట్‌డీడ్ చేయించుకుని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెంటమ్మ, లక్ష్మయ్య దంపతులకు ఇద్దరు కుమారులు సత్యనారాయణ, రాములు. వారికి భాగ్యవతి, విజయతో వివాహాలు జరిపించారు. భర్త లక్ష్మయ్య గతంలోనే మృతిచెందగా, పెద్ద కుమారుడు 2017లో, చిన్న కుమారుడు 2026 మార్చిలో మరణించారు. పెద్ద కుమారుడు మృతిచెందిన తర్వాత కోడలు భాగ్యవతి పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి పెంటమ్మ చిన్న కుమారుడు, కోడలి వద్ద ఉంటున్నారు.చిన్న కుమారుడు మృతిచెందిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో పెద్ద కోడలు భాగ్యవతి వృద్ధాప్య పింఛన్ ఇప్పిస్తానని చెప్పి పెంటమ్మను వెంట తీసుకెళ్లారు. బ్యాంకు ఖాతా తెరవాలంటూ మరోచోటికి తీసుకెళ్లి పింఛన్ దరఖాస్తు పేరుతో వేలిముద్రలు తీసుకున్నారని తెలిపారు.
కొన్ని రోజుల పాటు తన వద్ద ఉంచుకున్న అనంతరం బయటకు పంపించడంతో తిరిగి శ్రీరంగవరం చేరుకుని రెండో కోడలి వద్ద ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తన వేలిముద్రలు తీసుకుని ఇంటిని గిఫ్ట్‌డీడ్ చేయించుకున్నట్లు, ప్రస్తుతం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని పెంటమ్మ వాపోయారు. జీవితమంతా ఆ ఇంటిలోనే గడిపానని, దాన్ని అమ్మితే తనకు ఆధారం లేకుండా పోతుందని కన్నీటిపర్యంతమయ్యారు. మోసపూరితంగా చేయించుకున్న గిఫ్ట్‌డీడ్‌ను రద్దు చేసి, తన ఇంటి వద్దే తనకు పోషణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నారు.
Also read: వంకాయను ఇలా కాల్చి రోటి పచ్చడి చేస్తే.. రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు!