Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. నేడు సాయంత్రం 6 గంటల సమయానికి ప్రచారం ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం రాజకీయ పార్టీలు తమ మైకులను బంద్ చేసుకోవాల్సి ఉంటుంది.
దీంతో మైకులతో హోరెత్తిన నగరాలు, గ్రామాల్లో నిశ్శబ్ధ వాతావరణం నెలకొననున్నది. మే 13న పోలింగ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో పోలింగ్ కు 48 గంటల ముందు సమయంలో ఎటువంటి ప్రచారం చేయడానికి వీలుండదు.. ఎందుకంటే ఈ 48 గంటలపాటు నిశ్శబ్ధ కాలం(సైలెంట్ పీరియడ్) అమలులో ఉంటుంది. ఈ 48 గంటల సమయంలో ఎటువంటి ప్రచారాలు చేయకూడదు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు ఆ ప్రాంతాలను వదిలి తిరిగి వారి వారి స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది.
అదేవిధంగా ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయడకూడదు. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా స్తబ్ధంగా జరిగిన ప్రచార కార్యక్రమాలు.. గత రెండు వారాల నుంచి ఊపందుకున్నాయి. ఇప్పటివరకు ప్రధానంగా మూడు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ముమ్మర ప్రచారం చేశాయి. భారీ బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, కార్నర్ షోలు, రోడ్ షోలు నిర్వహించారు. నేతలు తమ ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. అంతేకాదు.. జాతీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలను రంగంలోకి కూడా దింపాయి. వారి చేత రాష్ట్రంలో ప్రచారం చేయించాయి.
పోలింగ్ సమయం దగ్గరపడడంతో ఎన్నికల యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేయడంపైన దృష్టి సారించింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేడు సాయంత్రం నుంచి ఈ నెల 14 తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయనున్నారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజున కూడా మూసివేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ తాండూర్, కామారెడ్డి కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ ఏపీలో పర్యటించి బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా కూడా నేడు వనపర్తిలో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
Also Read: కేసీఆర్ ధన దాహానికి పాలమూరు బలైంది: సీఎం రేవంత్
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 51 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.