Father and Daughter body found: ఆదివారం వరదల్లో కారుతో గల్లంతయిన తండ్రి-కూతురు మృతదేహాలు లభ్యమయ్యాయి. కూతురు అశ్విని డెడ్‌బాడీ లభించగా, సోమవారం తండ్రి మోతీలాల్ మృత దేహం లభ్యమైంది. వీరిని ఆ స్థితిలో చూసి కన్నీరుమున్నీరయ్యారు కుటుంబసభ్యులు.
గడిచిన రెండురోజులుగా తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో గజగజలాడించింది. అయితే మహబూబాబాద్ జిల్లా పురుషోత్త మాయగూడెం వద్ద ఆకేరు వాగులో కారుతో సహా కొట్టుకుపోయారు తండ్రి మోతిలాల్, కూతురు అశ్విని. వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమ్మరి తండా సమీపంలో మోతీలాల్ బాడీని గుర్తించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారానికి చెందిన అశ్విని, ఢిల్లీ విత్తన పరిశోధన సంస్థలో శాస్త్రవేత్తగా పని చేస్తోంది. వారం కిందట ఖమ్మం వచ్చిన అశ్విని, సెలవులు పూర్తికావడంతో బయలుదేరింది.
ఆమె తండ్రి మోతీలాల్ ఆదివారం తన కూతుర్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి తీసుకొస్తున్నారు. మోతీలాల్ ప్రయాణిస్తున్న కారు.. మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది. సాయంత్రానికి అశ్విని మృతదేహాన్ని గుర్తించారు.
చివరకు సోమవారం ఉదయం తండ్రి మోతీలాల్ బాడీని కుమ్మరితండా వద్ద కనుగొన్నారు. అయితే ఘటనకు ముందు తాము ప్రమాదంలో ఉన్నామని చివరిసారి కుటుంబసభ్యులతో ఫోన్ మాట్లాడారు మోతీలాల్. ఆ మాటలు ఇప్పుడు బంధువులను కంటతడి పెట్టిస్తున్నాయి.