Father kills Daughter: వారిద్దరు ప్రేమించు కున్నారు.. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి..అయితే వారిద్దరు బంధువులే. కూతురు ప్రేమ వ్యవహారం తండ్రికి తెలిసింది. ఆగ్రహంతో రగిలిపోయిన తండ్రి, మూడో కంటికి తెలియకుండా చంపేశారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంచలనం రేపిన ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.
ఆదిలాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో కైలాస్ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. ఆయనకు 18 ఏళ్ల కూతురు ఉంది. ఈనెల 25న నార్నూర్కు చెందిన ఓ యువకుడితో అమ్మాయికి నిశ్చితార్థం జరగాల్సి వుంది. దీనికి రెండురోజులు ముందు కూతురు దిగులుగా ఉండటాన్ని గమనించారు తల్లిదండ్రులు. దీంతో కూతుర్ని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.
తాను మేనత్త కొడుకుని ప్రేమించానని చెప్పింది. ఈ విషయం తెలిసి ఆగ్రహంతో రగిలిపోయారు తల్లిదండ్రులు. అయితే రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కూతురు ప్రేమను తండ్రి తిరస్కరించాడు. అంతేకాదు ఆనాటి నుంచి ఆగ్రహంతో రగిలిపోయిన తండ్రి కైలాష్, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తన పరువు తీసిందని భావించారు.
మంగళవారం వేకువ జామున మూడో కంటికి తెలియకుండా కూతుర్ని గొంతు నులిమి చంపేశాడు. అక్కడి నుంచి అసలు డ్రామా మొదలు పెట్టాడు. కూతురి హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించి కుటుంబసభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు తండ్రి. కూతురు చనిపోయిందని ఆవేదన తండ్రిలో ఏ మాత్రం కలగలేదు. కూతురుకు అంత్యక్రియలు పూర్తి చేయడంతో అనుమానాలు తీవ్రమయ్యాయి. దీనిపై యువతి దగ్గర బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ALSO READ: పౌల్ట్రీ పరిశ్రమకు గుడ్ న్యూస్.. ఫ్యూచర్ సిటీలో కీలక ప్రాజెక్టుకు సీఎం గ్రీన్ సిగ్నల్!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి ఇష్టం లేక కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తొలుత నమ్మించే ప్రయత్నం చేశాడు తండ్రి. పోలీసుల తమదైన శైలిలో విచారణలో చేయడంలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పరువు పోతుందనే కారణంతో కుమార్తెను తాను హత్య చేసినట్లు అంగీకరించాడు తండ్రి కైలాస్. నిందితుడ్ని అరెస్టు చేశారు పోలీసులు.