Kukatpally Truck Park: స్వేచ్ఛ బ్యూరో: కూకట్ పల్లి ట్రాక్ పార్క్ భూముల వేలాన్ని నిలిపి వేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కూకట్ పల్లి మాధవరం కృష్ణారావు ఈ పిల్ ను దాఖలు చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన భూములను వాణిజ్య అవసరాలకు మళ్లించకుండా, ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు కేటాయించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
భూముల చుట్టూ కంచె వేసేలా చర్యలు
కబ్జాలకు గురి కాకుండా భూముల చుట్టూ ప్రభుత్వం కంచె వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ భూముల వేలాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. భారీ వాహనాలు, లారీల పార్కింగ్ కోసం మూసాపేట్, బాలానగర్ పారిశ్రామికవాడలకు సమీపంలో ఉన్న కూకట్ పల్లి వద్ద ఈ భూములను కేటాయించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిన్న వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న అంశమని అంటున్నారు.
హెచ్ఎండీఏ వద్ద నిరసన..
ట్రక్ పార్క్ భూముల వేలాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతోపాటు సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు నేతలు హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. శాంతిభద్రతల సమస్యలు ఏర్పడకుండా చూసేందుకు ఉన్నతాధికారులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, నిరసనలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
Also Read: వేల ఎకరాలు అమ్ముకున్న మీరా.. ఇప్పుడు మాట్లాడేది? బీఆర్ఎస్‌పై అద్దంకి ఫైర్