బిజీ లైఫ్ లో పక్కవారు ఏం చేస్తున్నారో పట్టించుకునే పరిస్థితిలో లేరు జనాలు. ఉరుకుల పరుగులు జీవితంలో పక్కవారిని కూడా పట్టించుకోవడం లేదు. కానీ, ఓ రైల్వే పోలీస్ తాను అందరి లాంటి వాడిని కాదని నిరూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరూ అతడిని చూసి రియల్ బాహుబలి అంటూ కొనియాడుతున్నారు. ఇంతకీ అసలు ఆయన ఏం చేశాడంటే..
తాజాగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ రైల్వే స్టేషన్ లో వికలాంగ ప్రయాణీకుడు రైలు ఎక్కేందుకు స్టేషన్ కు చేరుకున్నాడు. కాలు సరిగా లేకపోయినా ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఇబ్బంది పడుతూ ఎక్కుతున్నాడు. అటుగా వచ్చిన రైల్వే పోలీస్ అశ్వనీ కుమార్ అతడిని చూశాడు. పైకి ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్న దివ్యాంగ ప్రయాణీకుడిని అమాంతం తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. అతడు ఏ రైలు ఎక్కాలో అడిగి తెలుసుకున్నాడు. అలాగే మోసుకుంటూ వెళ్లి అతడు వెళ్లాల్సిన రైలు ఎక్కించాడు. బోగీలోకి ఎక్కిన తర్వాత అతడి రైలు టికెట్ ను చెక్ చేశాడు. అతడు ఎక్కాల్సిన రైలు కరెక్టే అని తెలుసుని.. అతడికి బై చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అశ్వినీ కుమార్ దివ్యాంగుడిని భుజాలపై మోసుకెళ్లే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మానవత్వం కంటే గొప్పది ఏదీ లేదు’ అంటూ ఆయన తన ఇన్ స్టాలో వీడియో షేర్ చేశాడు. నెటిజన్లు ఆయన చేసిన పని పట్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “సహాయం చేయడానికి మీకు డబ్బు అవసరం లేదు. దయ చూపే హృదయం ఉంటే సరిపోతుంది. అది మీ దగ్గర ఉంది” అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. “నిజమైన బాహుబలి” అంటూ మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “రియల్ పోలీస్” అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. “సర్.. మీరు నిజంగా గ్రేట్. సెల్యూట్ చేయకుండా ఉండలేకపోతున్నాను” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తంగా అశ్వినీ కుమార్ చేసిన పని పట్ల సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
Read Also: పర్సును కొట్టేసిన దొంగలు, కోపంతో ఏసీ కోచ్ విండో పగలగొట్టిన మహిళ, వీడియో వైరల్!
ఇక రైల్వే పోలీస్ అయిన అశ్వినీ కుమార్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సుమారు 4.7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తరచుగా ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ప్రజలకు పలు అంశాల గురించి అవగాహన కల్పిస్తూ వీడియోలు చేస్తాడు.
Read Also: టికెట్ కన్ఫార్మ్ కావడానికి ఇదో కొత్త ట్రిక్.. మాస్టర్ లిస్ట్‌తో ఇలా ట్రై చేయండి!