US Nuclear Weapons: రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాలపై భారీగా సుంకాలు విధిస్తూ ఎగుమతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. యుద్ధాలను ఆపేందుకు సుంకాలే మార్గమని ట్రంప్ భావిస్తున్నారు. యుద్ధాలను ఆపడంలో తన చాలా కీలకమని, నోబెల్ శాంతి బహుమతి కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు.
తాజాగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ఆ దేశ రక్షణ శాఖను ఆదేశించారు. 1992 తర్వాత అమెరికా అణు పరీక్షలు ప్రారంభించడం ఇదే మొదటిసారి. దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ ముందు ఈ ప్రకటన వెలువడింది. ఇతర అణ్వాయుధ దేశాలతో సమాన ప్రాతిపదికన అణు పరీక్షలను వెంటనే తిరిగి ప్రారంభించాలని రక్షణ శాఖను ఆదేశించినట్లు ట్రంప్ ప్రకటించారని రాయిటర్స్ సంస్థ తెలిపింది. అమెరికా చివరి 1992లో అణు పరీక్షలు నిర్వహించింది.
దక్షిణ కొరియాలో జిన్‌పింగ్‌తో సమావేశానికి ముందు.. ‘ఇతర దేశాలు అణు పరీక్షలు చేస్తు్న్నాయి, ఆ సమానంగా అణు పరీక్షలు తిరిగి ప్రారంభించాలని నేను రక్షణ శాఖను ఆదేశించాను. ఆ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. న్యూక్లియర్ ఆయుధాల పరంగా అమెరికా అగ్రస్థానంలో ఉండగా, రష్యా రెండు, చైనా మూడో స్థానంలో ఉందని గుర్తుచేశారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల వద్ద ఏ దేశంలో లేనన్ని ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. తన ఫస్ట్ టర్మ్ లో అణ్వాయుధాల పునరుద్ధరణతో ఇది సాధ్యమైందన్నారు. ఎంతో విధ్వంసాన్ని సృష్టించే అణు ఆయుధాలను తాను ప్రోత్సహించనని, కానీ వేరే మార్గం లేదని ఆయన అన్నారు.
రష్యా ఇటీవల న్యూక్లియర్ సామర్థ్యం గల బ్యూరెవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది ఏ రక్షణ వ్యవస్థనైనా ఛేదించగలదని మాస్కో ప్రకటించింది. ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో ఈ న్యూక్లియర్ క్షిపణిని మోహరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత వారం ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రష్యా పోసిడాన్ సూపర్ టార్పెడోను విజయవంతంగా పరీక్షించిందని పుతిన్ ప్రకటించారు. ఈ అణ్వాయుధం రేడియోధార్మిక తరంగాలు సృష్టించి తీరప్రాంతాలను నాశనం చేయగలదని పరిశోధకులు అంటున్నారు.
ఇటీవల రష్యా వరుసగా అణ్వాయుధాలను పరీక్షిస్తుండడం సరికాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడంపై దృష్టి పెట్టాలని కోరారు. అయితే తాజాగా అణ్వాయుధాల పరీక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో కొత్త ఆయుధాల తయారీతో పాటు, పాత వాటి సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు అణు పరీక్షలు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. రష్యా, చైనా నుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో అణ్వాయుధాల్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు అమెరికా వ్యూహాత్మక అడుగులు వేస్తుందని అంటున్నారు.
Also Read: Trump Xi Jinping Meeting: జిన్ పింగ్ తో డొనాల్డ్ ట్రంప్ భేటీ.. టారిఫ్ లపై చైనాకు భారీ ఊరట
అమెరికా జులై 1945లో న్యూ మెక్సికోలోని అలమోగోర్డోలో 20 కిలో టన్నుల అణు బాంబును పరీక్షించింది. ఈ పరీక్షలతో అమెరికా అణు యుగాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆగస్టు 1945లో జపాన్ లోని హిరోషిమా, నాగసాకిపై అణు బాంబులను ప్రయోగించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి ఉపయోగపడింది. కానీ కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసింది. నేటికి ఈ దుష్ప్రభావాలను జపాన్ ఎదుర్కొంటుంది.