Narayanpet News : నారాయణ పేట్ జిల్లా ధన్వాడలోని బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. విద్యార్థులు తిన్న భోజనంలో కల్తీ కావడంతో.. దాదాపు 25 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైయ్యారు. వారందరికీ ఆరోగ్యం దెబ్బతినడంతో ఆసుపత్రికి తరలించగా, ఆహారం కల్తీగా వైద్యులు నిర్ధరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే.. కొన్ని మెస్ లలో, హాస్టళ్లల్లో ఆహార కల్తీ ఘటనలు తీవ్ర చర్చనీయాంశం కాగా.. మరోసారు నారాయణ పేట్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
విద్యార్థులందరినీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారందరి ఆరోగ్యం స్థిమితంగానే ఉన్నట్లు తెలిపిన వైద్యులు.. కావాల్సిన మందులు అందించారు. కాగా.. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనకు కారణాలను అన్వేషిస్తున్నారు. విద్యార్థులకు అందించి ఆహారం ఏ తీరుగా విషపూరితంగా మారిందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.