ఒక వ్యక్తి జీవితంలో జ్యోతిష్యం ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుందని అంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో గ్రహాల స్థానాన్ని బట్టి అతని జీవితం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా గ్రహాల స్థానాలను బట్టి నిర్ణయితమవుతుందని అంటారు. గ్రహాలు శుభస్థానంలో ఉంటే ఆరోగ్య సమస్యలు రావని, అశుభ స్థానంలో ఉంటే వారికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో దానికి తగ్గ పరిష్కారాలు కూడా ఉంటాయని అంటారు. జ్యోతి శాస్త్రం ప్రకారం ఏ గ్రహాలు ఎలాంటి వ్యాధులకు కారణం అవుతాయో తెలుసుకుందాం.
గ్రహాల స్థానం వాటి ప్రభావం అనేది ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రతి గ్రహం ఏదో ఒక అవయవం, వ్యవస్థ లేదా జీవితంలో ఒక భాగాన్ని సూచిస్తుంది. గ్రహాల శుభ ప్రభావం ఉంటే అవయవాలు లేదా శరీరంలోని వ్యవస్థలు ఆరోగ్యంగా ఉంటాయి. అశుభ ప్రభావాన్ని చూపిస్తే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
సూర్యుడు
జాతకంలో సూర్యుడు మంచి స్థానంలో లేకపోతే ఆ వ్యక్తికి ఎన్నో రకాల సమస్యలు రావచ్చు. సూర్యుడు మనకు ఆత్మవిశ్వాసాన్ని, ఎముకల ఆరోగ్యాన్ని, కళ్ళు, హృదయాన్ని నియంత్రిస్తాడు. జీవ శక్తికి ఆయనే మూలం. ఎప్పుడైతే సూర్యుడు మంచి స్థానంలో ఉండడో అప్పుడు కంటి సమస్యలు, ఎముకల సమస్యలు, గుండె జబ్బులు, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. ఆ మనిషి సోమరితనంగా మారిపోతాడు. మానసిక ఒత్తిడికి గురవుతాడు.
చంద్రుడు
చంద్రుడు మనస్సును సూచిస్తాడు. అలాగే శరీరంలోనే రక్తప్రసరణను కూడా నియంత్రిస్తాడు. మన భావోద్వేగాలకు చంద్రుడే కారణం. అతడు సరైన స్థానంలో లేకపోతే తీవ్రమైన మానసిక ఒత్తిడి కలుగుతుంది. నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. రక్తపోటు పడిపోవడం లేదా అధికంగా మారడం వంటివి కనిపిస్తాయి. సైకోసిస్ వంటి మానసిక ఆందోళనలు కూడా చుట్టుముడుతాయి.
అంగారకుడు
అంగారక గ్రహం శరీరంలోని శక్తిని, రక్తం, కండరాలు, శారీరక బలాన్ని సూచిస్తుంది. అంగారక గ్రహం సరిగా లేకపోతే రక్తహీనత వంటి సమస్యలు వస్తాయి. గాయాలు తగలడం, యాక్సిడెంట్లు కావడం, ఆపరేషన్లు జరగడం వంటివి కూడా సంభవించవచ్చు. కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
బుధుడు
గ్రహాల రాకుమారుడు బుధుడు. ఇతడు నాడీ వ్యవస్థను, చర్మాన్ని, కమ్యూనికేషన్ సామర్ధ్యాలను తన అదుపులో ఉంచుకుంటాడు. జ్ఞాపకశక్తికి, మేధో శక్తికి కూడా ఇతనే కారకుడు. బుధుడు అశుభ స్థానంలో ఉంటే వారికి చర్మవ్యాధులు, తలనొప్పి, తల తిరగడం వంటి నాడీ వ్యవస్థ సమస్యలు వస్తాయి. సరిగా మాట్లాడలేరు. సంభాషణలో అంతరాయం కలుగుతుంది. ఆందోళన, గందరగోళం, చర్మంపై కురుపులు వంటివి కూడా రావచ్చు.
బృహస్పతి
బృహస్పతి కాలేయం, ఊబకాయం, మధుమేహానికి సంబంధించిన గ్రహం. వాటిని అదుపులో ఉంచాలంటే బృహస్పతి వల్లే అవుతుంది. ఎప్పుడైతే బృహస్పతి అశుభ స్థానంలో ఉంటాడో… అప్పుడు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, ఊబకాయం బారిన పడడం, డయాబెటిస్ వంటి వ్యాధులు రావడం జరుగుతుంది. అలాగే బృహస్పతి అజీర్ణానికి ఊబకాయానికి జీర్ణ సమస్యలకు కూడా కారణం అవుతాడు.
శుక్రుడు
శుక్రుడు పునరుత్పత్తి వ్యవస్థను మూత్రపిండాల ఆరోగ్యాన్ని, గొంతు ఆరోగ్యాన్ని కాపాడుతాడు. అతడు మంచి స్థానంలో లేకపోతే పునరుత్పత్తి వ్యవస్థ సమస్యల్లో పడుతుంది. అంటే పిల్లలను కనడం కష్టమైపోతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడడం, గొంతు వ్యాధులు రావడం బంటి సమస్యలు వస్తాయి. శుక్రుడు బలహీనంగా ఉంటే చర్మం మెరుపు తగ్గిపోతుంది. అకాల వృద్ధాప్యం వచ్చినట్టు కనిపిస్తారు.
శని గ్రహం
శని ఎముకలు, కీళ్లు, దంతాలు, చర్మానికి సంబంధించిన ఆరోగ్యాన్ని కాపాడే గ్రహం. అలాగే కర్మకు ఫలితాలను కూడా అందిస్తాడు. శనిగ్రహం సరిగా లేకపోతే ఆర్థరైటిస్ వంటి కీళ్లనొప్పులు వస్తాయి. దంత సమస్యలు రావచ్చు. సోరియాసిస్ వంటి చర్మవ్యాధులు, డిప్రెషన్, విచారం వంటి మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం పెరిగిపోతుంది.
రాహువు కేతువులు
వీటిని దుష్ట గ్రహాలుగా నీడ గ్రహాలుగా పిలుచుకుంటారు. వీరి వల్ల మానసిక సమస్యలు ఎక్కువగా వస్తాయి. చర్మవ్యాధులు కూడా వస్తాయి. ఆకస్మికంగా అనారోగ్యాలు వచ్చి పడతాయి. చర్మంపై అలర్జీలు, ఇన్ఫెక్షన్లు కూడా కలిగే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాలు సరైన స్థానంలో లేకపోతే ఆ వ్యక్తి గందరగోళంలో జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు.
Also Read: నారద మహర్షి జీవితంలో హాస్యమే కాదు ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంది – తెలుసుకుంటే కన్నీళ్లు ఆగవు